CM Jagan: ఎట్టకేలకు ఏపీ సీఎం జగన్ మంచి నిర్ణయం

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మంచి నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ ని వాయిదా వేసింది. ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా పరీక్షలను పోస్ట్ పోన్ చేసేందుకు ససేమిరా అని చెప్పిన జగన్ సర్కారు చివరికి ఏపీ హైకోర్టు సూచనతో పునరాలోచన చేసినట్లు ఇవాళ ఆదివారం సాయంత్రం పేర్కొంది. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన చేశారు. స్టూడెంట్స్ పేరెంట్స్ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గాక, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ ఇంటర్ ఎగ్జామ్స్ డేట్స్ వెల్లడిస్తామని మంత్రి వివరించారు.

మాది ప్రజా ప్రభుత్వం..

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకి తగినట్లు నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి సురేష్ తెలిపారు. విద్యార్థుల ప్రాణాల మీద, వారి భవిష్యత్ పైన ప్రేమ, బాధ్యత గల సర్కారుగా సురక్షిత వాతావరణంలో, పకడ్భందీ ఏర్పాట్ల మధ్య పరీక్షలను నిర్వహించాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే దేశ వ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగినట్లే ఏపీలోనూ కరోనా వ్యాప్తి చెందుతుండటంతో సంబంధిత పరిణామాలను గమనిస్తున్న విద్యార్థులు, వారి తల్లి దండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వీటన్నింటినీ గమనించి విద్యార్థులకు అనుకూల నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.

తొలి నుంచీ వ్యతిరేకం..

ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు, చివరికి ప్రజాశాంతి పార్టీ సైతం నిరసన వ్యక్తం చేశాయి. మంత్రులవి, వాళ్ల కుటుంబ సభ్యులవే ప్రాణాలు గానీ విద్యార్థులవి, వాళ్ల తల్లి దండ్రులవి కావా అని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టూడెంట్స్ భవిష్యత్ కోసమే పరీక్షలు పెడుతున్నామని అన్నారు. పరీక్షలను రద్దు చేయటం ఈజీయేనని, దానివల్ల ముందు ముందు విద్యార్థులకు నష్టం కలుగుతుందని, మెమోల్లో ఊరికి పాస్ అని రాసిస్తే ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు దొరకవని చెప్పారు. అయినప్పటికీ అపొజిషన్ పార్టీలు వెనక్కి తగ్గలేదు. విద్యార్థుల భవిష్యత్తు అనేది తర్వాత సంగతి.. ముందు వాళ్లు బతికుండాలి కదా అని ప్రశ్నించాయి. కేఏ పాల్ ఏకంగా దీక్షకు దిగారు. మొత్తానికి ఈ వివాదం సద్దుమణిగింది.

Advertisement