Jagan-Babu : నేతలిద్దరు.. అంశమొక్కటే.. ఉద్దేశమూ ఒక్కటే.. ఏపీలో ఇంట్రస్టింగ్

Jagan-Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఈ రోజు శుక్రవారం ఒకే అంశంపై స్పందించారు. అదే.. పోలవరం. ఇది అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్ట్ అని జగన్ అనగా దాన్ని త్వరగా పూర్తి చేయాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్య చేయగా చంద్రబాబు రెండో రోజు మహానాడులో ఈ ప్రస్తావన తెచ్చారు. నేతలిద్దరూ ఒకే రోజు ఒకే టాపిక్ పైన మాట్లాడటం అనుకోకుండా జరిగినప్పటికీ రాజకీయ పరిశీలకులకు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఏదైతే డిమాండ్ చేశారో జగన్ కూడా అధికారులను అదే ఆదేశించటం విశేషం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలనేదే ఈ ఇద్దరి ఉద్దేశం.

Jagan-Babu

ముందుగా డబ్బులిచ్చేది అందుకే..

పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తారనే డబ్బులను ముందుగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దిగువ కాఫర్ డ్యామ్ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,600 కోట్ల బిల్లులను పెండింగులో పెట్టిందని చెప్పారు. వివిధ దశల్లో నిలిచిపోయిన ఆ బిల్లులను క్లియర్ చేయించేందుకు ఆఫీసర్లు ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు. పోలవరంతోపాటు నేరడి బ్యారేజ్, వెలిగొండ టన్నెల్-2 పనుల పైన, వంశధార-నాగావళి నదుల అనుసంధానం పైన ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

Jagan-Babu

24 ప్రాజెక్టులను పూర్తి చేశాం..

తాము అధికారంలో ఉండగా మొత్తం 69 ప్రాజెక్టుల్లో 24 ప్రాజెక్టులను పూర్తి చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఆయా ప్రాజెక్టుల ద్వారా 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించామని చెప్పారు. పట్టిసీమను ఏడాదిలోనే కంప్లీట్ చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రై రెండేళ్లు పూర్తయినా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు మించి ఖర్చు పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగంలో వరుసగా ఐదేళ్లు 11 శాతం జీఎస్డీపీ సాధించిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ సర్కారుదని గొప్పగా చెప్పుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు కనీసం ఒక్క ఎకరా భూమినైనా సేకరించారా అని చంద్రబాబు నిలదీశారు.