Chiranjeevi : హద్దులు దాటుతున్న జనసైనికులు.. ఏకంగా చిరుపైనే విమర్శలా..?
NQ Staff - July 19, 2023 / 06:48 PM IST
Chiranjeevi :
జనసైనికులు రోజు రోజుకూ హద్దులు దాటిపోతున్నారు. పవన్ కల్యాణ్ లాగానే వారు కూడా ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోతున్నారు. నడక నేర్పిన వాడినే తిట్టినట్టుంది వారు చేస్తున్న పనులు. పవన్ నాయకుడిగా సక్సెస్ కాకపోతే.. మధ్యలోకి చిరంజీవిని తీసుకువచ్చి తిడుతున్నారు.
సాధించడం చేతకాక సాకులు చెప్పినట్టు.. పవన్ సక్సెస్ కాకపోతే చిరునే కారణం అని తిడుతున్నారు. అసలు చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ హీరో అయ్యేవాడా. ఈ రోజు ఇంత మంది పవన్ ను గుర్తిస్తున్నారంటే.. దానికి కారణం ఎవరు చిరంజీవి కాదా.. అసలు చిరంజీవే లేకపోతే పవన్ కల్యాణ్ కు లైఫ్ ఉందా.. కానీ ఇవేమీ వారు పట్టించుకోవట్లేదు.
అసలు పవన్ కల్యాణ్ ఒక రోజు మాట్లాడిన మాట మీద మరో రోజు ఉండడు. ఒకసారి తప్పు అన్న విషయాన్ని మళ్లీ ఒప్పు అంటాడు. ఆధారంలేని ఆరోపణలు చేస్తాడు.. విమర్శలు వస్తే.. మళ్లీ దాని జోలికి కూడా పోడు. ఇలా పొంతనలేని మాటలతో వారాహి యాత్ర చేస్తున్నాడు కాబట్టే ప్రజలు ఆయన్ను నమ్మట్లేదు. కానీ జనసైనికులు దీన్ని గుర్తించట్లేదు.
ఇప్పుడేమో ఏకంగా చిరంజీవినే విమర్శించే స్థాయికి ఎదిగారు. తాజాగా పార్టీలో మొదటి నుంచి ఉన్న రాయపాటి అరుణ అనే వీర మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఆ నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్లే ఇప్పుడు మా పవన్ కల్యాణ్ ను నాయకుడిగా ఎవరూ నమ్మడం లేదని చెబుతోంది.
ఆయనేమో విలీనం చేసి హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ మేం ఇక్కడ బాధపడుతున్నాం అంటూ వీడియో పెట్టేసింది. దీంతో చిరు అభిమానులు భగ్గుమంటున్నారు. అసలు చిరంజీవి సపోర్ట్ లేకపోతే పవన్ కల్యాన్ కనీసం జూనియర్ ఆర్టిస్టుగా కూడా పనికి రాడంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
మా అన్నయ్యకు విలీనం చేయడానికి అప్పుడు కనీసం ఎమ్మెల్యులు ఉన్నారు. మీకు అది కూడా దిక్కులేదు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోతే దానికి చిరంజీవి ఏం చేస్తాడు. మీకు గెలవడం చేతగాక మా అన్నయ్యను అంటారా అంటూ చిరు అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.
ఇలా మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయి వివాదాన్ని పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు ఎంటర్ అయ్యారు. లీవిట్.. ఆమె చేసిన కామెంట్లను వదిలేయండి. ఏదో ఫ్లోలో అలా అనేసింది. ఆమె పార్టీలో మొదటి నుంచి ఉన్న మహిళ. పట్టించుకోకండి అని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చిరు అభిమానులు మాత్రం మెగాస్టార్ నీడన ఎదిగిన పవన్ కల్యాణ్.. ఆ విషయాన్ని మర్చిపోయారంటూ భగ్గుమంటున్నారు.