Chiranjeevi: సీఎం జగన్ యాక్షన్.. చిరంజీవి సూపర్ రియాక్షన్..

Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు గానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపైన మాత్రం వెంటనే తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తద్వారా తన అభిమానుల, ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టిన గంటా రెండు గంటల్లోనే మెగాస్టార్ సూపర్ రియాక్షన్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఫుల్లు హ్యాపీగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడకి ఏపీ గవర్నమెంట్ సరైన గౌరవం కల్పించిందని హర్షం వ్యక్తం చేశారు.

ఎంతో ఆనందం..

‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రకటనతో నాకు మనస్పూర్తిగా ఎంతో ఆనందం కలిగింది. ఇండియాలోనే మొట్టమొదటి ఫ్రీడం ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూల్ ఎయిర్ పోర్టుకి పెట్టాలనుకోవటం ఆ అద్భుత పోరాట వీరుడికి, నిజమైన దేశభక్తుడికి ఇస్తున్న సముచిత గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి మహానుభావుడి నిజ జీవిత పాత్రను వెండి తెరపై పోషించే అరుదైన అవకాశం నాకు లభించటం నా అదృష్టం. పూర్వ జన్మ సుకృతం. సైరా సినిమాతో నాకు ఆ భాగ్యం కలిగింది’’ అని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ గా పోస్టు పెట్టారు.

Chiranjeevi
Chiranjeevi

తప్పుపట్టడానికీ వెనకాడలేదు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురితో కలిసి కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఏపీ ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా మెగాస్టార్ అభినందిస్తూనే ఉన్నారు. కరోనాతో అతలాకుతలమైన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆదుకోవటానికి జగన్ సర్కారు ఆమధ్య స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి ఇలాగే మెచ్చుకున్నారు. అదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. మెగాస్టార్ పొలిటికల్ అంశాల్లోనే కాదు పర్సనల్ గా కూడా వైఎస్ జగన్ తో క్లోజ్ గానే ఉంటున్నారు. ఒకటీ రెండు సార్లు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి కూడా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement