Chandrababu : తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ముందే చేతులు ఎత్తేసిన తమ్ముళ్లు, బాబే కారణం అంటూ ఆగ్రహం

Chandrababu : తిరుపతి పార్లమెంట్‌ సీటుకు రాబోతున్న ఉప ఎన్నికల కోసం సిట్టింగ్ పార్టీ అయిన వైకాపాతో పాటు అన్ని పార్టీలు కూడా సిద్దం అవుతున్నాయి. ముందే కూసిన కోకిల అన్నట్లుగా తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నిక కోసం మూడు నెలల ముందే అభ్యర్థిని ప్రకటించింది. తెలుగు దేశం పార్టీ తరపున తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి పోటీ చేయబోతున్నట్లుగా స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఆమె గెలుపుకు కృషి చేయాలని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాని ఇప్పటి వరకు ఉప ఎన్నికకు సంబంధించిన హడావుడి అయితే కనిపించడం లేదు.

గతంలో ఓడి పోయిన పనబాక లక్ష్మి ని మళ్లీ పోటీకి దించడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఇంకా పలువురు బలమైన అభ్యర్థులు ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు పనబాక లక్ష్మి కోసం ప్రచారం చేయడం కష్టంగా మారింది. ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు నియోజక వర్గాల ఇంచార్జ్‌ లు పనబాక లక్ష్మి విషయమై అసంతృప్తితో ఉన్నారు. తమ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం వల్ల లాభం కంటే ఎక్కువగా నష్టం జరిగిందని అంటున్నారు. పనబాక లక్ష్మి ని అభ్యర్థిగా పెట్టడం వల్ల పార్టీలో ఇప్పటి నుండే కుమ్ములాటలు మరియు ప్రత్యర్థి పార్టీ వారికి ఒక మంచి అవకాశంగా దక్కింది. పనబాక లక్ష్మి యొక్క మైనస్ పాయింట్లను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఆమెను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తప్పుడు నిర్ణయం అంటూ తిరుపతిలో గెలుపు సాధ్యం అయ్యేపని కాదు అంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే చేతులు ఎత్తేశారు. మరి ఎన్నికలు ముందు ఉన్న సమయంలో బాబు తమ్ముళ్లకు ఏమైనా నూరి పోసి పనబాక లక్ష్మిని విజేతగా నిలిపేలా చేస్తాడో చూడాలి.