Chandrababu: కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకు..

Kondala Rao - May 14, 2021 / 08:35 PM IST

Chandrababu: కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకు..

Chandrababu: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో తన వెన్నంటి నిలిచిన కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు స్థానిక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎట్టకేలకు కదిలారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి ప్రజల్ని ఆదుకోవటం కోసం సొంత నిధులు కోటి రూపాయలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఇవాళ శుక్రవారం కుప్పంలోని పార్టీ లీడర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన సెగ్మెంటులో యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కి కూడా లెటర్ రాస్తానని చెప్పారు. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉండగా అన్ని చోట్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు పంపిణీ చేస్తానని తెలిపారు. వైద్య సిబ్బందిని కూడా నియమించాలని సూచించారు.

రూ.35 లక్షలతో ఆక్సీజన్ ప్లాంట్..

కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్ లో 35 లక్షల రూపాయలతో ఆక్సీజన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. ఆస్పత్రిలోని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ప్రాణవాయువు సరఫరాను గ్రౌండ్ ఫ్లోర్ కి కూడా అందించాలని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టెలీ మెడిసిన్ ని, ఆహార పంపిణీని మరింత ఎక్కువగా నిర్వహించాలని, పల్స్ ఆక్సీమీటర్లను రేపు శనివారమే అందిస్తామని చెప్పారు. లోకల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 200 బెడ్లను, ఒకేషనల్ జూనియర్ కాలేజీలోని కొత్త బిల్డింగులో 200 పడకల్ని ఏర్పాటుచేసి ఐసోలేషన్ సర్వీసుల్ని అందించాలని సూచించారు. కుప్పం ప్రజల శ్రేయస్సు కోసం ఈ పనులు చేయాలనుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు.

శెభాష్.. సార్..

చందబ్రాబు నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించకుండా సొంత డబ్బులతో ప్రజాసేవ చేస్తాననటాన్ని స్వాగతిస్తున్నారు. గతంలో జన్మభూమి వంటి కార్యక్రమాలను అమలుచేసిన ఆయన ప్రజలు ప్రతిదానికీ సర్కారుపైనే ఆధారపడకూడదని, కొన్ని పనులను సొంతంగా చేసుకోవాలని హితవు పలికిన వ్యక్తే. ఇన్నాళ్లకు మళ్లీ కరోనా పుణ్యమా అని ఒక మంచి పనికి పూనుకున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆయన బాటలో నడవాలని జనం కోరుతున్నారు. కొవిడ్ కంట్రోల్ కోసం వైఎస్సార్సీపీ గవర్నమెంట్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నా టీడీపీవాళ్లు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారనే అసంతృప్తి పబ్లిక్ లో ఉంది. దాన్ని కాస్తయినా తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us