Chandrababu : మద్యం కుంభకోణంలోనూ బాబుగారి మాయ!

NQ Staff - November 25, 2023 / 05:29 PM IST

Chandrababu : మద్యం కుంభకోణంలోనూ బాబుగారి మాయ!

Chandrababu :

చంద్రబాబు నాయుడు తీరే వేరు. తనను తాను అవినీతి రహితుడనని, తననొక పుణ్యపురుషుడిగా కీర్తించుకుంటూ ఉంటారు. అయితే ఆయన చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నది అందరికీ తెలిసిందే. కేబినెట్ ముందు పెట్టే ప్రతిపాదనలు ఒకటైతే.. అవి ఆమోదం పొందిన తర్వాత తమకు నచ్చిన పత్రాలు కలిపేసి మొత్తాన్ని కేబినెట్ ఆమోదించినట్టు జనాన్ని నమ్మిస్తారు. తద్వారా కోట్లు కొట్టేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.. అంటే మనకు చూపించేది ఒకటి.. లోపల అమలు చేసేది మరొకటి అన్నమాట. ఎవరైనా అడిగితే ఇదంతా కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని బుకాయించడం షరామాములే.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సృష్టికర్త చంద్రబాబే. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, కేబినెట్ కు తెలియకుండా, అస్మదీయులకు చెందిన బెవరేజీలు, మద్యం షాపులు, బార్లకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనిచేశారు. అందుకోసం 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8శాతం + జీఎస్టీ, బార్లపై ఉన్న 9శాతం + జీఎస్టీ ప్రివిలేజ్‌ ఫీజును తొలగిస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేశారు. తద్వారా ఖజానాకు రూ.1,299.64 కోట్ల మేర గండికొట్టారు. సంబంధిత నోట్‌ ఫైళ్లపై అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర డిజిటల్‌ సంతకాలు చేసినట్టు అధికారిక రికార్డుల ద్వారా వెల్లడవుతోంది.

అనుమతి లేదు.. ఆమోదం లేదు..

2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎక్సైజ్(మద్యం) విధానాన్ని తీసుకొచ్చింది. దాని కోసం కేబినెట్ మీటింగ్ కు ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్ ను ప్రభుత్వానికి పంపారు. మద్యం షాపులు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని ప్రతిపాదించారు. కానీ ఆ ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్‌ దృష్టికే తీసుకెళ్లలేదు.

కొత్త మద్యం విధానంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి 2015 జూన్‌ 22న జీవోలు 216, 217 జారీ చేసింది. కానీ ఆ రెండు జీవోల్లో మద్యం దుకాణాల(ఏ4 షాపుల)కు ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తున్నట్టు కనీసం పేర్కొనలేదు. కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రభుత్వానికి ఓ నోట్‌ పంపారు. అందులో మద్యం దుకాణాలపై ప్రివిలేజ్‌ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్‌ చట్టంలోని 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్‌ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఆమేరకు ‘కాపీ టు పీఎస్‌ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

దీన్ని బట్టి ప్రివిలేజ్‌ ఫీజు తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. కానీ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తున్న విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు అడ్డగోలుగా వాదిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఇక చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం అదే రోజు అంటే 2015 జూన్‌ 22 సాయంత్రం జీవో 218 జారీ చేసింది. కేబినెట్‌లో చర్చించి జీవోలు 216, 217 జారీ చేశారు. కానీ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తున్నట్టు జారీ చేసిన జీవో 218 గురించి కేబినెట్‌లో చర్చించలేదు.

బార్ల అంశంలోనూ బరితెగింపే..

మద్యం షాపుల ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి అస్మదీయులకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన చంద్రబాబు తమ సన్నిహితులైన బార్ల ఓనర్లకు కూడా లబ్ధి చేకూర్చే పని చేశారు. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని…అందుకోసం ఎక్సైజ్ చట్టంలోని 10(ఏ) నిబంధనను తొలగించాలని అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ 2015 సెప్టెంబర్ 1న ప్రభుత్వానికి ఓ సర్క్యూలర్‌ పంపారు. కానీ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు కనికట్టు చేశారు. అందుకోసం 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు ఓ వినతిపత్రం సమర్పించినట్టు రికార్డుల్లో చూపించడం గమనార్హం.

సెప్టెంబరు 9న వినతి పత్రం సమర్పిస్తే… అంతకు ముందు అంటే సెప్టెంబరు 1నే ఎక్సైజ్‌ కమిషనర్‌ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి సర్క్యూలర్‌ ఎలా పంపారన్నది చంద్రబాబే చెప్పాలి. ఏకపక్షంగా బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేయాలని నిర్ణయించారు. అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదంతోనే ఈ వ్యవహారాన్ని నడిపారు.

అందుకు సంబంధించిన నోట్‌ ఫైళ్లపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్‌ 3న, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్‌ 4న డిజిటల్‌ సంతకాలు చేయడం గమనార్హం. కానీ అసలు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు తెలీదని టీడీపీ న్యాయవాదులు, ఈనాడు వితండవాదం చేస్తుండడం ఎల్లో గ్యాంగ్‌ కుట్ర రాజకీయాలకు నిదర్శనమని తెలుస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు రూ.1,299.64 కోట్లు గండి పడిందని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తప్పుబట్టారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us