Chandra Babu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భం లేదంటారు. కానీ ఇప్పుడు ఆ అవసరం.. కాదు కాదు అత్యవసరం వచ్చి పడింది. రచ్చ గెలవటం తర్వాత సంగతి ముందు ఇంట గెలవాలని ఆయన ప్రస్తుతం గట్టిగా అనుకుంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ.. చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది కదా. మళ్లీ అలాంటి అనుభవమే చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో ఎదురైంది. దీంతో ఆయన రెండు మూడు రోజుల్లో అక్కడికి వెళుతున్నారు. మూడు రోజుల పాటు అక్కడే పర్యటిస్తారంట.
25, 26, 27 తేదీల్లో..
కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబు కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం తదితర ప్రాంతాలకు వెళతారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అసలేం జరిగిందో క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటారు. కుప్పం సెగ్మెంట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగిన 89 స్థానాల్లో తెలుగుదేశం మద్దతుదారులు కేవలం 14 చోట్ల మాత్రమే నెగ్గగలిగారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ సపోర్ట్ చేసినోళ్లు ఏకంగా 75 పల్లెల్లో విజయం సాధించారు. దీంతో జగన్ పార్టీ నాయకులు, మంత్రులు ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుకు కుప్పంలోనే దిక్కులేదంటూ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న సోమవారం ఎద్దేవా చేశారు. దీంతో అపొజిషన్ లీడర్ పునరాలోచనలో పడ్డారు.

అంతా అలర్ట్: Chandra Babu
బాబు సొంత నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కూడా ఊహించనంతగా టీడీపీ ఫెయిల్ అవటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీంతో అలర్ట్ అయిన ఈ మాజీ ముఖ్యమంత్రి కుప్పం నాయకులతో రీసెంటుగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అందరికీ ధైర్యం చెప్పారు. నేను చూసుకుంటాను అనే భరోసా ఇచ్చారు. అదే సమయంలో స్థానిక లీడర్లకు క్లాస్ పీకారు. ఎలాగూ మనమే కదా గెలిచేది అనే ధీమాతో మీరు పోలింగ్ బూతులను, కౌంటింగ్ సెంటర్లను పట్టించుకోలేదని, లైట్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి ప్రక్షాళనకు తెర తీయనున్నారని భావిస్తున్నారు.