Chandra Babu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తన స్థానంలో వచ్చే నెల (మార్చి) ఒకటి నుంచి మరో వ్యక్తి వస్తారని చెప్పారు. కొత్త పీఏ తిరుపతి నుంచి వస్తున్నారని తెలిపారు. తాను పదవి నుంచి తప్పుకుంటున్నాననే సంగతిని సార్(చంద్రబాబు)కి కూడా చెప్పానని, అయితే ఆయన వద్దని వారించారని మనోహర్ వెల్లడించారు. సార్ వద్దన్నప్పటికీ తాను మాత్రం ఇక పీఏగా కొనసాగలేనని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు. ఇకపై తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని మనోహర్ వివరించారు.
బాబు టూర్..
ప్రతిపక్ష నేత చంద్రబాబు రేపటి (గురువారం) నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన కోసం చేయాల్సిన ఏర్పాట్లపై నిన్న (మంగళవారం) కుప్పంలో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. ఇందులో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులతోపాటు బాబు పీఏ మనోహర్, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో తెలుగు దేశం పార్టీ ఓడిపోవటానికి మునిరత్నం, శ్రీనివాసులు, మనోహర్ కారణమని వివిధ మండలాల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ఫిర్యాదులు, ఆరోపణలు, ఆవేశాల్ని ప్రత్యక్షంగా చూసిన చంద్రబాబు పీఏ తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా ప్రకటన చేశారు.

అసలు విషయం: Chandra Babu
కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి తనకు అక్కర్లేదని, రాజీనామా చేస్తానని మునిరత్నం కూడా ప్రకటించారు. చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లపై చర్చించటానికి భేటీ అయిన నాయకులు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, రాజీనామాల ప్రస్తావనలతో అసలు విషయం మర్చిపోయారు. మీటింగు రసాభాసగా ముగిసింది. ఏర్పాట్లపై సమీక్ష జరపకుండా వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులైతే కనీసం వేదిక మీదికి రావటానికి కూడా ఒప్పుకోలేదు. జరిగేదంతా చూస్తూ మౌనంగా ఉండిపోయారు. దీన్నిబట్టి కుప్పంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. చంద్రబాబు పర్యటన అనంతరమైనా చక్కబడుతుందో లేదో చూడాలి.