AP: ఆంధ్రప్రదేశ్ కి అవార్డులే అవార్డులు

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ పనితీరు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 17 అవార్డులు ఇచ్చింది. గ్రామ పంచాయతీలకి 10, మండలాలకి 4, జిల్లాలకి 2, రాష్ట్ర స్థాయికి ఒకటి చొప్పున వీటిని బహూకరించింది. అవార్డుల సంఖ్యపరంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవల్ లో నాలుగో స్థానంలో నిలిచింది. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్ దే. గతేడాది 15 పురస్కారాలను దక్కించుకున్న ఏపీ ఈసారి మరో రెండింటిని అదనంగా కైవసం చేసుకోవటం గమనార్హం. ఇ-పంచాయత్ కేటగిరీలో స్టేట్ లెవల్ లో రెండో ర్యాంక్ రావటం విశేషం.

సౌత్ లో నంబర్ 1

దక్షిణ భారతదేశంలో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది. జిల్లా స్థాయి పురస్కారం కింద రూ.50 వేలు, మండలానికి రూ.25 వేలు, పంచాయతీకి జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కష్ట కాలంలో గ్రామ పంచాయతీలు బాగా పనిచేశాయని మెచ్చుకున్నారు. ఈసారి కూడా కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇదే ఇన్ స్పిరేషన్ తో ముందుకి సాగాలని సూచించారు. ఈ మహమ్మారికి పల్లె స్థాయి నుంచే చెక్ పెట్టాలని ప్రధాని మోడీ కోరారు.

జగన్ ముందుచూపు వల్లే..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు, సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రానికి 17 జాతీయ అవార్డులు వచ్చాయని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రౌండ్ లెవల్ లో ప్రజలకు అత్యుత్తమ పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని చెప్పారు. గ్రామాల్లో ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చాక, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక పాలన మరింత పారదర్శకంగా, డెవలప్మెంట్ దిశగా సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ పురస్కారాలను సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో విజేతలకు నిన్నే అందజేశారు.

Advertisement