Bye-Election : పోలింగ్ తక్కువ.. ఫైటింగ్ ఎక్కువ..

Bye-Election : ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఉప ఎన్నిక పోలింగ్ ఇవాళ శనివారం విజయవంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. అయితే తిరుపతిలో సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం చాలా తక్కువ (55 శాతం మాత్రమే) పోలింగ్ నమోదు కాగా నాగార్జునసాగర్ లో రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉన్న డేటా మేరకు 88 శాతం ఓటింగ్ నమోదు కావటం విశేషం. తిరుపతి పోలింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేసరికి ఓటింగ్ శాతం కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది.

Bye-Election : different situations in tirupati and nagarjunasagar
Bye-Election : different situations in tirupati and nagarjunasagar

ముందే చేతులెత్తేసిన..

తిరుపతి పోరులో తెలుగుదేశం పార్టీ ముందే చేతులెత్తేసింది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ రాజకీయ రచ్చకు తెర లేపింది. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారని ఆరోపించింది. ఫేక్ ఓటింగ్ కారణంగా బైఎలక్షన్ ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కే.రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఉపఎన్నిక నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించారు. తిరుపతి బైఎలక్షన్ ని మళ్లీ పెట్టాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు సైతం సీఈసీకి లెటర్ రాశారు. ఎల్లో మీడియా ఇవాళ మొత్తం ఇదే కథ నడిపింది. టీడీపీ బాటలోనే బీజేపీ, కాంగ్రెస్, జనసేన కూడా నడవటం గమనార్హం.

పనికిమాలిన..: Bye-Election

అపొజిషన్ పార్టీ లేవనెత్తిన లోపాలపై అధికార పక్షంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (ఏపీసీఈవో) స్పందించారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ లీడర్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రెండు రోజుల ముందు నుంచే ఈ దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని, గతంలో మున్సిపల్ ఎన్నికలప్పుడూ ఇలాగే చేసిందని సజ్జల గుర్తుచేశారు. తమ పార్టీ (వైఎస్సార్సీపీ) ఓడిపోతుందని గానీ, మెజారిటీ తగ్గుతుందని మాకు ఎలాంటి అనుమానాలూ లేవని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా దొంగ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఈవో విజయానంద్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. కాగా ఎక్కువ పోలింగ్ నమోదు కావటానికి ప్రయత్నించాల్సిన రాజకీయ పార్టీలు ఇలా పనికిమాలిన విమర్శలకు దిగటం శోచనీయమని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు.

Advertisement