BJP vs JANASENA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న గురువారం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీ-జనసేన అలయెన్స్ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని కమలం పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. వైఎస్సార్సీపీ, టీడీపీ ఈ పని చేయగలవా అని కూడా ఆయన సవాల్ విసిరారు. అయితే, సోము చేసిన ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే కామెడీ కూడా చేస్తున్నారు.
అబ్జెక్షన్ యువరానర్..
వీర్రాజు ఇచ్చిన స్టేట్మెంట్ పట్ల మొదట మిత్రపక్షమే అభ్యంతరం తెలిపింది. ఆయన తాజా ఈ వ్యాఖ్యలు తమకు తలనొప్పిగా మారాయంటూ జనసేన తప్పపట్టింది. సోము గతంలో కూడా ఇలాగే ఏకపక్షంగా మాట్లాడారని, తిరుపతి బై ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేటే బరిలోకి దిగుతాడనటం తమను తీవ్ర గందరగోళంలోకి నెట్టిందని పవన్ కళ్యాణ్ పార్టీవాళ్లు గుర్తుచేస్తున్నారు. మనిద్దరి మధ్య విభేదాలు రాకుండా ఉండాలంటే సోము ఇకనైనా ఇలాంటి మాటలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.
సన్యాసీ.. సన్యాసీ: BJP vs JANASENA
సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందనే మాట అందరికీ తెలిసిందే. ఏపీలో బీజేపీ, జనసేన యవారం చూస్తుంటే అదే అనిపిస్తోందని విమర్శకులు దెప్పిపొడుస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని బట్టి చూస్తే ఈ పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా కలవకుండా బరిలో దిగినా అధికారంలోకి వచ్చేంత సీనైతే లేదని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చీఫ్ మినిస్టర్ పదవి గురించి మాట్లాడుకోవటం చీపుగా ఉంటుందని హితవు పలుకుతున్నారు.
నేల విడిచి ‘సోము’ చేయొద్దు..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గానీ లోక్ సభ ఎలక్షన్స్ లో గానీ బీజేపీ బోణీ చేయలేదు. జనసేనకు ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. వాస్తవానికి ఈ రెండు పార్టీల బలాబలాలు ఇలా ఉంటే ఈ లోపాన్ని సరిచేసుకోవాల్సిందిపోయి అధికారం.. ముఖ్యమంత్రి.. వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేల విడిచి సాము చేసినట్లే ఉంటుందని సోము గారు గ్రహిస్తే మంచిదనే సలహాలు సూచనలు వస్తున్నాయి.

సాన బట్టాల్సిన సేన: BJP vs JANASENA
ఈ విషయంలో జనసేన కూడా బీజేపీ కన్నా తక్కువేం తినలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు తప్ప ఈ పార్టీ వైఎస్సార్సీపీ సర్కారు వైఫల్యాల్ని పట్టిచూపుతున్న పాపాన పోవట్లేదు. ప్రజా సమస్యలపైన పెద్దగా పోరాడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఏదో ఎన్నికల ముందొచ్చి సినిమా డైలాగుల మాదిరిగా ఆవేశంతో మాట్లాడితే ఓట్లు పడవు. అధికారం దక్కదు. సీఎం కాలేరు. ఇప్పుడున్న జీరో స్థితి నుంచి ఒక్కసారే, రాత్రికి రాత్రే హీరో కావటం మామూలు విషయం కాదని జనసేన కూడా తెలుసుకోవాలని, లేకపోతే ఆలూ లేదు చూలూ లేదు సీఎం పేరు సోమలింగం అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది.