Nimmagadda: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ప్రతిపక్ష పార్టీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎందుకంటే నిమ్మగడ్డ పట్టు విడవని విక్రమార్కుని వలే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై పోరాడి.. చివరికి తన పంతం నెగ్గించుకొని తన పదవి కాలం లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా నిమ్మగడ్డ ఎత్తులు పైఎత్తులకు ఆశ్చర్యపోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంతో పాటు అధికారులంతా కూడా ఒకే తాటిపై నడిచినప్పుడు.. అసలు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్నప్పుడు.. నిమ్మగడ్డ ఏమాత్రం అధైర్య పడకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి వారందరినీ తన దారిలోకి తెచ్చుకున్నారు.

అయితే ఈ పరిణామాలను గమనించిన బీజేపీ పార్టీ నేతలు నిమ్మగడ్డ వేసే అడుగులను నిశితంగా పరిశీలిస్తున్నారు. మొదట్లో నిమ్మగడ్డ తీరుపై ఎంతో అసహనం వ్యక్తం చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు ఆయన జగన్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే తీరుని చూసి తెగ పొగుడుతున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనితీరుపై ఒక కన్నేసి ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కాగానే ఆయనకు మధ్యప్రదేశ్ గవర్నర్ పదవి అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. నిమ్మగడ్డను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఒక ప్రతిపాదన చేసిందని, ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదముద్ర కూడా వేశారని సమాచారం.
నిమ్మగడ్డ యొక్క ఎన్నికల కమిషనర్ పదవి కాలం పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయనతో చర్చలు జరపనున్నారు అని తెలుస్తోంది. అయితే మధ్యప్రదేశ్ లేదా రాజస్థాన్ రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రానికి నిమ్మగడ్డను గవర్నర్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చి తాము అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే సమర్థవంతుడైన గవర్నర్ తమ వాడైతే రాజస్థాన్ లో తమ జండా ఎగరవేయడం సులువవుతుందని.. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రణాళికలు పన్నుతునట్టు తెలుస్తుంది.