Bandi : బండి.. ‘తిరుపతి’కి ఎందుకు వెళ్లలేదు?.. పిలవలేదా?..

Bandi : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి నిన్న బుధవారమే వెళతారని, అక్కడ ఒక ర్యాలీలో పాల్గొంటారని అన్నారు. కానీ ఆయన వెళ్లలేదు. నేటితో ప్రచార గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు తిరుపతి ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. కొంత మందేమో ఆయన నాగార్జునసాగర్ శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. కానీ అది నిజం కాదని మరికొందరు అంటున్నారు. బండి సంజయ్ గనక ప్రచారానికి వస్తే పార్టీకి మరింత నష్టం కలుగుతుందని, అందుకే ఆయన్ని పిలవ లేదని ఇంకొందరు గుసగుసలాడుతున్నారు.

Bandi : where is bandi sanjay in tirupati bye-elecion campaign
Bandi : where is bandi sanjay in tirupati bye-elecion campaign

ఎందుకు?..

గతంలో ఒకసారి ఈ బండి సంజయ్ తిరుపతి ఉపఎన్నిక విషయమై స్పందిస్తూ ఆ నియోజకవర్గ ప్రజలు బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలని హెచ్చరించారు. ఈ కామెంట్ తీవ్ర దుమారం రేపింది. కమలం పార్టీకి నెగెటివ్ గా పని చేసింది. ఇలా మాట్లాడటం సరికాదని జనసేన పార్టీ అధ్యక్షుడు, కాషాయం పార్టీ మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి ‘బండి సంజయ్ వల్ల ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి కె.రత్నప్రభకు మైనస్ తప్ప ప్లస్ కాదు’ అనుకున్నట్లు చెబుతున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారయ్యాక రత్నప్రభ కూడా హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిశారు తప్ప బండి సంజయ్ తో కనీసం మర్యాదపూర్వకంగానైనా భేటీ అయినట్లు లేరు. సమావేశమైతే వార్తలు వచ్చేవే.

‘రఘు’ వెళ్లినా: Bandi

తిరుపతిలో ప్రచారానికి తెలంగాణ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఒక్కడే వెళ్లినట్లు అనిపిస్తోంది. అతను కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తెలంగాణ ఉద్యమాన్ని మట్టికరిపించి రామరాజ్యం భావనను పైకి తెచ్చామని తిరుపతిలో చెప్పటంపై ప్రతికూల ఫీడ్ బ్యాకే వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక బీజేపీ నేతలు ఈ నష్టనివారణ కోసం ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ‘తెలంగాణ ఉద్యమ పార్టీని’ అనబోయి ‘తెలంగాణ ఉద్యమాన్ని’ అని అన్నాడని కవర్ చేసుకునేందుకు ట్రై చేశారు. కమలం పార్టీ హిందూ అజెండాని మోస్తుందని ప్రపంచం మొత్తానికి తెలిసినా బండి సంజయ్ మాత్రం ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం’ అని, అందుకే తిరుపతి ప్రచారానికి పిలవలేదని టాక్.

లోటు భర్తీ..

బండి సంజయ్ తిరుపతి ప్రచారానికి వెళ్లకపోయినా ఆ లోటును కాషాయం పార్టీ ఎంపీ, ఏపీ బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు భర్తీ చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువా కాదా అనే అంశాన్ని ఆ పార్టీవాళ్లు స్పష్టం చేయాలంటూ ఈ రాజ్యసభ ఎంపీ నిన్న బుధవారం ఢిల్లీలో డిమాండ్ చేశారు. గూడూరులో చర్చికి వెళ్లి పాస్టర్ ఆశీర్వాదం తీసుకున్న గురుమూర్తి తిరుమలకు ఎందుకు వెళ్లాడని జీవీఎల్ నరసింహారావు నిలదీశారు. ఇంతకీ తిరుపతిలో గెలిచే క్యాండేట్ ప్రజాసేవ చేయాలా లేక దైవసేవ చేయాలా అనే దానిపై ముందు బీజేపీవాళ్లు క్లారిటీ ఇస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement