AV Subba Reddy : బీజేపీకి అధ్యక్షురాలివా.. టీడీపీకి పాలేరువా?

NQ Staff - November 13, 2023 / 03:52 PM IST

AV Subba Reddy : బీజేపీకి అధ్యక్షురాలివా.. టీడీపీకి పాలేరువా?

AV Subba Reddy :

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపై సొంత పార్టీ నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఒక జాతీయ పార్టీ.. ఆ పార్టీకి సైద్ధాంతిక విలువలుంటాయి. అందులో పనిచేసేవారు వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాల కోసం పాకులాడడం, నియంతృత్వ పోకడలకు పోవడం కుదరదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం అనేది అస్సలే ఉండదు. జాతీయ నాయకత్వం ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా పార్టీ ప్రయోజనాల కోసమే చేయాలి. ఆ పార్టీ లైన్ దాటితే ఇక అంతే సంగతులు. బీజేపీలో పని చేయాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అలాంటిది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పురందేశ్వరి.. ఒక్క నిబంధన కూడా పాటించడం లేదని పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా టీడీపీకి లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్తున్నారు.

ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏవీ సుబ్బారెడ్డి మీడియా ఎదుట తన నిరసన గళం వినిపించారు. ఆమె వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఎంతో మంది బీజేపీ అధ్యక్షులతో పోల్చుకుంటే.. పురందేశ్వరి ఎంతో భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆమె ‘ఎల్లో’ ఏకపక్ష ధోరణితో వెళ్తున్నారని, తాను అధ్యక్షురాలినని..తాను ఏదీ చేస్తే అదే చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో మహిళలపై అంతర్గత దాడులు జరుగుతున్నా పురందేశ్వరి పట్టించుకోవడం లేదన్నారు. గతంలో అంజనా చౌదరి అనే బీజేపీ నేతపై తమ పార్టీ నేతలే కుట్ర చేశారని, వారిని గత అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ నుంచి బయటకు పంపారని, కానీ పురందేశ్వరి అధ్యక్షురాలిగా ఎంపికైన తర్వాత వారికి కీలక పదవులు ఇచ్చారని చెప్పారు. అంజనా చౌదరి వద్దని వాపోయినా వారికే పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజనాతో కనీసం మాట్లాడలేదని, సున్నితమైన అంశంలో కూడా పురందేశ్వరి ఆమెకు తగిన సపోర్ట్ ఇవ్వలేదని విమర్శించారు.

పురందేశ్వరి అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఆమెను పార్టీలోకి స్వాగతించామని కానీ ఆమె పార్టీకి ద్రోహం చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. బీజేపీలో జాతీయ నాయకురాలిగా పనిచేస్తున్నప్పుడు ఆమె భర్తను వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ ఎదగపోవడానికి ప్రధాన కారణం ప్రాంతీయ పార్టీలు అని, అలాంటిది పురందేశ్వరి టీడీపీ అనే ప్రాంతీయ పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారని అన్నారు. చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేస్తే టీడీపీ కార్యకర్తల కంటే ముందే పురందేశ్వరి ‘‘ఈ అరెస్టులు అక్రమం, కక్ష పూరితంగా కేసులు పెట్టారు’’ అని ఆయనకు ఎలా మద్దతు పలుకుతారని ప్రశ్నించారు. తెలుగు దేశం అంతర్గత వ్యవహారాలతో బీజేపీకి ఏం సంబంధమని.. అది ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చూసుకుంటారు కదా.. అని మండిపడ్డారు.

టీడీపీ, వైసీపీల్లో అవినీతిని ఎండగట్టి, బీజేపీ గొప్పతనాన్ని చాటాల్సింది పోయి.. ఓ పార్టీకి ఏకపక్షంగా మద్దతుగా ఎలా నిలుస్తారని విమర్శించారు. అలాగే బీజేపీకి మోదీ వంటి ప్రపంచస్థాయి నేత ఉన్నాడని, ఆయన గొప్పతనాన్ని, బీజేపీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి ఓట్లు సంపాదించాల్సింది పోయి చంద్రబాబును వెనకేసుకు రావడం ఏంటని ప్రశ్నించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పనితీరుపై సుబ్బారెడ్డి ఒక్కరే కాదు.. సగటు బీజేపీ కార్యకర్త కూడా ఆగ్రహంగానే ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర నాయకత్వ పదవిలో ఉండి.. ప్రాంతీయ పార్టీకి పాలేరులా వ్యవహరించడం ఎందుకని అంటున్నారు. బంధుత్వాలు ఇంటి వద్దకే పరిమితం చేయాలని, అధ్యక్ష పదవిలో ఉంటూ పార్టీకి చెడ్డపేరు తేవొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని, లేకుంటే పార్టీ పగ్గాలను చేపట్టడానికి నిబద్ధత కలిగిన నేతలు ఎందరో ఉన్నారని హితువు పలుకుతున్నారు.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us