YCP : విశాఖలో మంత్రుల వాహనాలపై దాడి.! తమపైనా దాడి చేశారంటున్న మంత్రులు.!
NQ Staff - October 15, 2022 / 09:10 PM IST

YCP : విశాఖ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ కోసం గర్జన నిర్వహించింది. ఉదయం వైసీపీ గర్జన, సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.! గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాలపై అధికార వైసీపీ నుంచి కవ్వింపు చర్యల్ని చూస్తూనే వున్నాం.
‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విశాఖలో అడుగు పెట్టనివ్వం..’ అంటూ వైసీపీ నేతలు హెచ్చరించారు.
ఈ లిస్టులో పలువురు మంత్రులు కూడా వున్నారు. మరోపక్క, ‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’ అంటూ జనసేన పార్టీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ షురూ అయ్యింది. మంత్రుల వాహనాలపై దాడి, మంత్రులపైన కూడా.? వైసీపీ ముఖ్య నేతలు ‘గర్జన’ కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో, వారంతా ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుంటుండగా, పెద్ద సంఖ్యలో గుమికూడి వున్న జనం వారి కార్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
దాడి చేసింది జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులేనని మంత్రులు ఆరోపిస్తున్నారు. మంత్రి రోజాపై హెల్మెట్‌తో ఒకరు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. తన మీద కూడా దాడి చేసినట్లు జోగి రమేష్ చెబుతున్నారు. అయితే, గతంలో ఇదే విశాఖ విమానాశ్రయం సాక్షిగా కోడి కత్తి డ్రామాకి తెరలేపారనీ, ఇప్పుడు వాహనాలపై దాడి.. అంటూ వైసీపీ కొత్త డ్రామా మొదలు పెట్టిందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. కాగా, మంత్రులకు సంబంధించిన వాహనాలు పాక్షికంగా ధ్వంసం కావడంతో, ఈ దాడికి కారణమెవరన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది.