AP-TS: ఆంధ్రప్రదేశ్ ఆరోపణ.. ఖండించిన తెలంగాణ..

Kondala Rao - May 14, 2021 / 04:12 PM IST

AP-TS: ఆంధ్రప్రదేశ్ ఆరోపణ.. ఖండించిన తెలంగాణ..

AP-TS: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్వల్ప వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి రానీయట్లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ లేదా సంబంధిత ఆస్పత్రి అనుమతి ఉంటే అభ్యంతరం చెప్పట్లేదని తెలంగాణ అంటోంది. ఈ నేపథ్యంలో కొందరు తెలంగాణ హైకోర్టుకి వెళ్లారు. దీంతో ఏపీ అంబులెన్సులకు పర్మిషన్ ఇవ్వకపోవటం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. అయినా ఈరోజు శుక్రవారం మళ్లీ ఇదే సమస్య తలెత్తింది. దీంతో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్నీ దాఖలుచేశారు. ఈ పరిణామాలపై అటు ఏపీ, ఇటు తెలంగాణ ఏమంటున్నాయో చూద్దాం..

అసంతృప్తి.. ఆవేదన..

తెలంగాణ బోర్డర్లలో అంబులెన్సులను నిలిపివేస్తుండటం పట్ల ఆంధ్రప్రదేశ్ సర్కారు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీ పేషెంట్లు ఎమర్జెనీ అయితే బెంగళూరు, చెన్నైతోపాటు హైదరాబాద్ వెళుతున్నారని చెప్పారు. మిగతా రెండు సిటీల నుంచి రాని అబ్జెక్షన్ హైదరాబాద్ నుంచే రావటం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఇష్టం వచ్చినట్లు విభజించి మౌలిక వసతుల్లేని ఏరియాలని ఏపీకి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ సరిహద్దుల్లో తలెత్తుతున్న గొడవలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో, తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్నారని చెప్పారు. ఇది మానవత్వంతో చూడాల్సిన సమయమన్నారు. గత ప్రభుత్వ(టీడీపీ) హయాంలో ఏపీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించి ఉంటే ఇప్పుడీ ఇబ్బంది వచ్చేది కాదని సజ్జల విమర్శించారు.

బెడ్లు లేనప్పుడు వస్తే ఎలా..

ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అంశాలను తెలంగాణ గవర్నమెంట్ తోసిపుచ్చింది. ఏ రాష్ట్ర ప్రజలనూ ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీతోపాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి రోగులు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలిపారు. దాదాపు 45 శాతం బెడ్లను ఇతర రాష్ట్రాల వాళ్లకే కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక్కడి హాస్పిటల్స్ లో పడకలు లేనప్పుడు ఏపీ నుంచే కాదు.. ఎక్కడి నుంచి వచ్చినా ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. అందుకనే ముందుగా ఆస్పత్రుల నుంచి అనుమతి తీసుకొని బయల్దేరాలని సూచించారు. ఈ విషయమై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ గతంలోనే ఏపీ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్ రాశారని శ్రీనివాసరావు గుర్తు చేశారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us