AP-Telangana : తెలంగాణ ఏం తేల్చిచెప్పిందో.. ఆంధ్రప్రదేశ్ కూడా అదే అంటోంది..

AP-Telangana : కరోనా లాక్డౌన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అదే అంటోంది. తెలంగాణలో ఇకపై లాక్డౌన్ పెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు శనివారం ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఏడాది కిందట రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జరిగినప్పుడు దానికి సరైన చికిత్సా విధానం తెలియకపోవటం వల్ల లాక్డౌన్ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఇవాళ గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

భయపడొద్దు..

దేశవ్యాప్తంగా పెరుగుతున్నట్లే ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని మంత్రి సుచరిత వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19 టీకా వేయించుకోవటానికి ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ విషయంలో వస్తున్న ఫేక్ న్యూస్ ని నమ్మొద్దని కోరారు. టీకా వేయించుకున్న తర్వాత నెలన్నరపాటు (45 రోజులు) జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నంత మాత్రాన ఆందోళన చెందొద్దని, తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎవరికివారు జాగ్రత్తగా ఉంటే కరోనాను కంట్రోల్ చేయొచ్చని అభిప్రాయపడ్డారు.

AP-Telangana : two telugu states saying same dialogue
AP-Telangana : two telugu states saying same dialogue

80 వేల మందిపై: AP-Telangana

పెరుగుతున్న పాజిటివ్ కేసులకు తగ్గట్లే టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నామని ఏపీ హోం మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి వ్యాక్సినేషన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సంవత్సర కాలంగా మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన 80 వేల మందిపై పోలీసులు కేసులు పెట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖానికి మాస్కులు కట్టుకోవాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సచివాలయాల్లో సైతం వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటుచేశామని వెల్లడించారు. కొవిడ్-19తో సహజీవనం చేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు చెప్పినప్పుడు అందరూ కామెడీ చేశారని, ఇప్పుడు అదే జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత గుర్తుచేశారు.

Advertisement