AP Elections: సర్పంచ్ ఎన్నికలు.. సమ్ థింగ్ స్పెషల్..

AP Elections ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎలక్షన్లలో గెలిచినవాళ్లు చాలా మంది నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కొన్ని చోద్యాలు, వింతలు, విశేషాలు, ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి ముఖ్యంగా రెండు జిల్లాల్లో (కర్నూలు, అనంతపురంలలో) జరగటం చెప్పుకోదగ్గ విషయం. కర్నూలు జిల్లాలోని కౌతాళం మండలం చూడి అనే ఊరిలో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం వివాదాస్పదంగా మారింది. గ్రామ ప్రథమ పౌరురాలిగా లక్ష్మి అనే మహిళ ఎన్నిక కాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. నిన్న బాధ్యతల స్వీకారానికి రాలేకపోయారు. దీంతో లక్ష్మికి బదులుగా ఆమె భర్త ఉప్లప్ప చేత ప్రమాణం చేయించటం కొత్త గొడవకి దారితీసింది. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సూర్యనారాయణ పంచాయతీ కార్యదర్శికి మెమో ఇచ్చారు. ఒకరి స్థానంలో మరొకరు ప్రమాణం చేయటాన్ని చోద్యంగా పేర్కొంటున్నారు.

ఆసక్తికరం..

కర్నూలు జిల్లాలోనే మరో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆళ్లగడ్డ మండలం బత్తలూరు గ్రామానికి చెందిన ఆవుకు చెంచమ్మ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. రీసెంట్ సర్పంచ్ ఎలక్షన్ లో 230 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఆ యువతి కూడా నిన్న శనివారమే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఎగ్జామ్ రాయటానికి వెళ్లింది. ప్రమాణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ చేసిన పంచాయతీ సెక్రెటరీ.. చెంచమ్మ రాకకోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఉదయం 11 గంటలకు పరీక్ష అయిపోవటంతో ఆమె నేరుగా గ్రామానికి వచ్చి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు ఊరి బాగు కోసం పాటుపడతానని చెంచమ్మ పేర్కొంది.

అనంతపురంలో..

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో గత 15 ఏళ్ల నుంచి గ్యాస్ డెలివరీ బాయ్ గా చేస్తున్న తిరుపాల్ అనే వ్యక్తి సర్పంచ్ పదవికి ఎన్నికయ్యాడు. ప్రెసిడెంట్ పదవి ఎస్సీలకు రిజర్వ్ కావటం ఆయనకు కలిసొచ్చింది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తెల్లారి నుంచే గ్రామ పంచాయతీ ఆఫీసుకు వెళుతున్నాడు. ఉదయం 9 గంటల వరకు స్థానికుల సమస్యల పరిష్కారం కోసం సమయం కేటాయిస్తున్నాడు. అనంతరం యథావిధిగా ఇంటింటికీ తిరుగుతూ గ్యాస్ డెలివరీ చేస్తున్నాడు. ఊరికి ప్రెసిడెంట్ అయినా తన మూలాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవటం తిరుపాల్ ప్రత్యేకత.

జయమ్ము.. నిశ్చయమ్మురా..

అనంతపురం జిల్లాలోనే మరో వింత సంఘటన జరిగింది. పామిడి మండలంలోని దేవరపల్లి సర్పంచ్ గా 2013 జూలై 31న జరిగిన ఎన్నికల్లో జయమ్మ, ఓబులమ్మ పోటీపడగా ఓబులమ్మ గెలిచినట్లు అధికారులు కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు. కానీ తాను ఒక్క ఓటు తేడాతో గెలిచినా అధికారులు గిమ్మిక్కులతో తనకు అన్యాయం చేశారంటూ జయమ్మ కోర్టుకు వెళ్లి నెగ్గారు. ఆ తీర్పును అమలుచేసేందుకు సైతం ఆఫీసర్లు ససేమిరా అనటంతో హైకోర్టుకి వెళ్లి అక్కడా జయకేతనం ఎగరవేయటం విశేషం. ఎనిమిదేళ్ల తర్వాత అదే ఆఫీసర్ తో జయమ్మకు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని నిన్న శనివారం అందించటం గమనార్హం.

Advertisement