AP panchayat elections : ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం నాలుగు దశల్లో జరగనుండగా ఇప్పటికి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే తేదీ కూడా నేటి(గురువారం)తో ముగిసింది. మరోవైపు రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే లాస్ట్ డేట్ సైతం ఇవాళతోనే సమాప్తం అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఏకగ్రీవాలైన పంచాయతీల సంఖ్య పెరుగుతోంది.
ప్రాంతాల వారీగా..
రాయలసీమలోని 4 జిల్లాలకు గాను చిత్తూరు జిల్లాలోని 454 పంచాయతీల్లో ఇప్పటివరకు 96 యునానిమస్ గా ఎన్నిక పూర్తయ్యాయి. అత్యధిక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన జిల్లాగా చిత్తూరు మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలోని 193 విలేజిల్లో 54 ఊళ్లు పోలింగ్ లేకుండానే సర్పంచ్ ని ఎన్నుకున్నాయి. అనంతపురం జిల్లాలోని 169 పంచాయతీలకు గాను 6 గ్రామాలు యునానిమస్ గా ప్రెసిడెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలోని 206 పల్లెల్లో 21 ఊళ్లు ఏకగ్రీవమయ్యాయి.
కోస్తాంధ్రలో: AP panchayat elections
గుంటూరు జిల్లాలోని 337 ఊళ్లల్లో 67 పల్లెలు పోటీలేకుండానే ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని 239 గ్రామాలకు గాను 40 గ్రామాలు యునానిమస్ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాల్లోని 321 విలేజీల్లో 34 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికలను ముగించాయి. విశాఖ జిల్లాల్లోని 340 పల్లెలకు గాను 32 పల్లెలు పోటీ అనే మాట లేకుండా ప్రశాంతంగా ప్రెసిడెంట్ ని ఎన్నుకున్నాయి.

మిగతా చోట్ల..
కృష్ణా జిల్లాలోని 234 గ్రామాల్లో 20 గ్రామాలు ఏకగ్రీవం లిస్టులో చేరాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 366 ఊళ్లల్లో 28 ఊళ్లు యునానిమస్ గా సర్పంచ్ ని సెలెక్ట్ చేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని 229 విలేజిలకు గాను 16 విలేజ్ లు ‘‘ఎవరు ప్రెసిడెంట్’’ అనే విషయంలో పంతాలకు పోకుండా ఒకే మాట మీద నిలబడ్డాయి. చివరిదైన నెల్లూరు జిల్లాలోని 163 పల్లెల్లో 14 పల్లెలు యునానిమస్ గా సర్పంచ్ ని ఎన్నుకున్నాయి. ఇప్పటివరకు అతి తక్కువ(ఆరు మాత్రమే) ఏకగ్రీవ పంచాయతీలైంది అనంతపురంలోనే కావటం గమనార్హం. ఏకగ్రీవాలు ఎక్కువ కాకుండా చూడండి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచిస్తున్న సంగతి తెలిసిందే.