AP panchayat elections : ‘విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలేవి’ అంటే ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కానీ ఒక్క పంచాయతీలో మాత్రం జరగట్లేదు. ఆ పంచాయతీ అల్లాటప్పా పంచాయతీ కూడా కాదు. జగమెరిగిన పంచాయతీ. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పంచాయతీ. అది ఒక్క కొండ మీద కాదు. ఏకంగా ఏడుకొండల మీద ఉన్న పంచాయతీ. అదే.. తిరుమల. కలియుగ దైవం కొలువైన నేల. శ్రీవారి కోవెల. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతున్న తిరుమల కూడా ఒక పంచాయతీయే. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక బహుశా ఈరోజే వెలుగులోకి తెచ్చినట్లుంది. అయితే అక్కడ పంచాయతీ ఎన్నికలను నిర్వహించట్లేదు.
ఎందుకు?..
హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతోపాటు స్వామివారికి కైంకర్యాలు, సేవలు అందించటం కోసం ఎన్నో కుటుంబాలు ఎప్పటి నుంచో తిరుమలలోనే స్థిరంగా ఆవాసాల్ని ఏర్పాటుచేసుకొని ఉంటున్నాయి. దీంతో తిరుమల క్రమంగా ఒక గ్రామంలా విస్తరించింది. అక్కడ మొత్తం జనాబా పది వేలకు పైగానే ఉంటుంది. అందులో ఓటర్ల సంఖ్య నాలుగు వేల పైచిలుకు. వీరిలో కొంత మంది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు కాగా మిగతావాళ్లు వ్యాపారులు. దాదాపు అందరూ అక్కడే స్థానికంగా ఉంటున్నారు. తిరుమల ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఆ ఊరును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతంగా గుర్తించింది. గ్రామ పంచాయతీ అనే గుర్తింపు కూడా ఇచ్చింది.

అయినా: AP panchayat elections
తిరుమల కూడా గ్రామ పంచాయతీయే అయినప్పటికీ అక్కడ ఎప్పుడూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేదు. సర్పంచ్, వార్డు మెంబర్లతో కూడిన పాలక వర్గం అంటూ ఏదీ లేదు. అన్నీ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే (ఈఓనే) చూసుకుంటారు. అంటే ఆ ఈవోనే గ్రామాభివృద్ధి అధికారి అని చెప్పుకోవచ్చు. ఆ పంచాయతీ డెవలమ్మెంట్ అంతా టీటీడీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. స్థానికుల సమస్యలను టీటీడీయే పరిష్కరిస్తుంది. తిరుమలలో ఉండే ఓటర్లు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలేవీ అక్కడ ఉండవు. అదీ సంగతి. ఏడు కొండల వాడా.. వేంకటరమణా.. గోవిందా.. గోవిందా.