AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికలకు.. ఏం ‘ఫినిషింగ్ టచ్’ ఇచ్చాడులే..

AP Panchayat Elections : ఆంధ్రప్రదేశ్ లో మొన్న ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తోంది. ఈ ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారే హైలైట్ గా నిలుస్తున్నారు. అయితే ఆయన కన్నా ఆసక్తికరంగా ఒక కాంగ్రెస్ నాయకుడు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. కాకపోతే అది కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. అయినప్పటికీ ‘ఎప్పుడొచ్చామన్నది కాదు ముఖ్యం’ అనే స్టైల్లో సోషల్, రెగ్యులర్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆ నాయకుడు అనామకుడు కాదు. అందరికీ తెలిసిన వ్యక్తే. కానీ ఈ వీడియోలో మాత్రం ఆయన్ని చూసి గుర్తుపట్టడం అంత సులభం కాదు. ఆయన పేరు డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి. అనంతపురం జిల్లా నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి. ఏపీసీసీ మాజీ చీఫ్ కూడా.

ఏం చేశాడు?..

గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి రోజున అంటే ఆదివారం నాడు పూర్తిగా డిఫరెంట్ లుక్కులో కనిపించారు. ఎవరూ పోల్చుకోలేని విధంగా మారిపోయారు. దారిన పోయే దానయ్య లాగా, అతి సామాన్యుడిగా దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక పాత స్కూటర్ పైన తన సతీమణి సునీతతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వార్తల్లో నిలిచారు. తెల్ల గడ్డం, సగటు రాయలసీమ రైతు ఆహార్యం, ఆర్.నారాయణమూర్తి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ముక్కురాజును గుర్తుకు తెచ్చేలా, అసలు ఈయన రఘువీరారెడ్డేనా అనే డౌటొచ్చేలా చేశారు.

AP Panchayat Elections : finishing touch to ap panchayat elections by congress leader
AP Panchayat Elections : finishing touch to ap panchayat elections by congress leader

రెండూ ఒకటే : AP Panchayat Elections

మొన్నీమధ్య వరకూ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకుడు ఎన్.రఘువీరారెడ్డి సొంతూరు అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం. ఆయన ఇంటి పేరు, ఊరు పేరు రెండూ ఒకటే కావటం గమనార్హం. ఆ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేయలేదు. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలోని గంగులవాయిపాళ్యంలో పెట్టారు. దీంతో రఘువీరారెడ్డి ఇలా నింపాదిగా వచ్చి ఓటేశారు. తన ఇలాకాలోని ఈ గుంగులవాయిపాళ్యంతోపాటు గోవిందాపురం పంచాయతీలోనూ ఆయన హస్తం పార్టీని గెలిపించటం కొసమెరుపు.

Advertisement