AP panchayat elections : ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రతి అభ్యర్థీ పైసలను మంచి నీళ్ల మాదిరిగా ఖర్చుపెడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించిన హద్దులు దాటేసి చాలా దూరం పోతున్నారు. డబ్బు కాదు ముఖ్యం.. గెలుపే లక్ష్యం.. అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఏకగ్రీవాల్లో ఏముంది మజా.. పోటీకి దిగితే కదా తెలిసేది రాజా.. అనుకుంటూ అభ్యర్థులు ఒకరికి మించి ఒకరు లక్షల్లో ధారపోస్తున్నారు.
లిమిట్స్?..
గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో క్యాండిడేట్లు చేయాల్సిన వ్యయానికి సంబంధించి ఎస్ఈసీ కొన్ని పరిమితులు విధించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేలకు మించిన జనాభా గల ఊరిలో ప్రెసిడెంట్ అభ్యర్థి రెండున్నర లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. వార్డు మెంబర్ క్యాండిడేటైతే 50 వేల వరకు అనుమతిస్తారు. 10 వేల లోపు పాపులేషన్ కలిగిన పల్లెల్లో ఈ లిమిట్స్ ని లక్షన్నర, 30 వేలుగా నిర్ణయించారు. కానీ, ఈ కట్టుబాటుని ఎవరూ పట్టించుకోవట్లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదనపు వ్యయాన్ని బంధుమిత్రుల ఖాతాల్లోనో, కార్యకర్తల అకౌంట్లలోనో వేసేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎందుకిలా?: AP panchayat elections
ఏపీలో పంచాయతీ పోరు మాంచి జోరు మీదుంది. ప్రతి గ్రామంలోనూ పోటీ నువ్వానేనా అన్నట్లు నడుస్తోంది. బరిలో నిలబడ్డవాళ్ల కన్నా బయటివాళ్లే దూకుడు ప్రదర్శిస్తున్నారు. జనాన్ని తమ వైపుకి తిప్పుకోవటానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రతిదానికీ మనీ మనీ అంటున్నారు. మీటింగులు, గ్రూపులు, టిఫిన్లు మొదలుకొని నైట్ డిన్నర్ల వరకు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, పాంప్లెట్లు, కేబుల్ టీవీల్లో ప్రచారాలు.. ఇలా అడుగడుగునా వేలల్లో ఖర్చు అవుతోంది. ప్రచారంలో మంది ఎక్కువ కనపడటం కోసం పనిగట్టుకొని తిరిగినోళ్లకు, చాటింపు వేసేవారికి, డప్పులు కొట్టేవారికి, బ్యాండ్ మోగించేవారికి.. ఈవిధంగా చెప్పుకుంటూపోతే రోజువారీగా ఎంతో మందికి ఎన్నో పేమెంట్లు చేయాల్సి వస్తోంది.

చివరి రోజు..
రేపు పొద్దున్నే పోలింగ్ జరగనుందంటే ఈరోజు రాత్రే ఓటుకు నోటు పంపకాలు షురూ చేస్తారు. అవతలివాళ్ల కన్నా మనం వందో రెండొందలో ఎక్కువే ఇద్దాం అన్నట్లు కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తుంటారు. డబ్బుతోపాటు మందు, చీరలు, జాకెట్లు, చొక్కాలు.. కాదేదీ అనర్హం అన్నట్లుగా పంచిపెడుతుంటారు. ఇవన్నీ జమేసుకుంటే ఎస్ఈసీ పెట్టిన లిమిట్ కి డబుల్, ట్రిపుల్ ఖర్చు తేలుతుందని చెబుతున్నారు.