AP panchayat elections : తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలోని ఆయన ఇంట్లో మంగళవారం పొద్దున అరెస్ట్ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి కొవిడ్-19 తదితర టెస్టులు చేయించారు. ఆ తర్వాత కోటబొమ్మాళిలోని కోర్టుకు తరలించారు.
ఏం జరిగింది?..
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొన్న ఆదివారం నిమ్మాడలో అచ్చెన్నాయుడు, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు, టీడీపీ కేడర్ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్న అన్న కొడుకు అప్పన్న వైఎస్సార్సీపీ సపోర్టుతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయటానికి ప్రయత్నించగా మొదట ఫోన్ లో, తర్వాత నామినేషన్ కేంద్రం వద్ద అచ్చెన్న బ్యాచ్ అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి.
చాలా సెక్షన్లు: AP panchayat elections
నిమ్మాడ లో రెండు రోజుల కిందట జరిగి పరిణామాలకు కారణమైన 22 మందిపై పలు సెక్షన్ల కింద కేసులయ్యారు. ఇప్పటికే 12 మంది అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పన్న ఇచ్చిన కంప్లైంట్ తో అచ్చెన్నపై ‘‘హత్యాయత్నం, బెదిరింపులకు దిగటం’’ సహా మొత్తం 13 సెక్షన్ల కింద కేసులు రాసినట్లు తెలుస్తోంది.

సాయిరెడ్డి ఓదార్పు యాత్ర..
నిమ్మాడలోని అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం చెప్పటానికి, టీడీపీ నేతల చేతిలో దాడికి గురైన అప్పన్న కుటుంబాన్ని పరామర్శించటానికి ఈరోజు వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వస్తున్నారు. దీంతో ఆ ఊరిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దింపారు.