CM Jagan: జగనన్న టౌన్లు.. జిందాబాద్..

CM Jagan ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో ఉంటూ తక్కువ ఆదాయం వల్ల సొంతగా ఇళ్ల స్థలాలను కొనుక్కోలేకపోతున్నవారికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘జగనన్న స్మార్ట్ టౌన్లు’ పేరుతో లేఔట్లను డెవలప్ చేయనున్నారు. వాటిని మిడిల్ ఇన్ కం గ్రూపు (ఎంఐజీ) ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నా తక్కువ రేటుకే విక్రయిస్తారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల లోపు ఉన్నవారు దీనికి అర్హులు. ఈ ఇళ్ల స్థలాల కోసం వార్డు సచివాలయాల్లోనే అప్లై చేసుకోవచ్చు. అయితే ముందుగా వీటి పట్ల ఎంత మంది ఆసక్తి కనబరుస్తున్నారో తెలుసుకుందామని సర్కారు సర్వే చేయిస్తే పది రోజుల కిందట లక్ష మంది మాత్రమే ఇంట్రస్ట్ పెట్టగా ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షల 79 వేలకే చేరింది. అంటే జనం జగనన్న టౌన్లకి జిందాబాద్ చెబుతున్నట్లే లెక్క.

లాభ నష్టాలతో పనిలేదు..

సకల సౌకర్యాలు ఉండే ఈ ప్లాట్లను లాభ నష్టాలతో పనిలేకుండా లబ్ధిదారులకు కేటాయిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈమధ్య ప్రకటించారు. అనంతరం ఏప్రిల్ ఫస్టు నుంచి డిమాండ్ అసెస్మెంట్ సర్వేని ప్రారంభించి నిన్న మంగళవారంతో ముగించారు. ఎంఐజీ లేఓట్లలో ఇళ్ల స్థలాల కొనుగోలుకు జనం సుముఖంగా ఉన్నారనే విషయం దీంతో వెల్లడైంది. అత్యధికంగా విశాఖపట్నంలో 85,541 మంది, అతి తక్కువగా పశ్చిమ గోదావరిలో 17,418 మంది ఆసక్తి కనబరిచారు.

మూడు కేటగిరీలుగా..

ఈ లేఔట్లను టౌన్లకి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి చేస్తారు. జిల్లా కేంద్రంలో 150-250 ఎకరాలు, ఇతర పట్టణాల్లో 50-100 ఎకరాలు సేకరించి ప్లాట్లుగా, లేఔట్లుగా డెవలప్ చేస్తారు. వీటికోసం అప్లై చేసుకుంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ప్లాట్ ఇస్తారు. ఎంఐజీ ఒకటో కేటగిరీలో 150 చదరపు గజాలు, రెండో కేటగిరీలో 200 చదరపు గజాలు, మూడో కేటగిరీలో 240 చదరపు గజాల ప్లాట్లని ఇస్తారు. దరఖాస్తులకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తారని అంటున్నారు. దీంతో పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరినట్లే. వారికిది తియ్యటి కబురే.

Advertisement