AP Elections: బ్రేకింగ్ న్యూస్ : ఏపీలో ఎన్నికలకు హైకోర్టు నో

AP Elections ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్లుండు గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు ఇవాళ మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. పరిషత్ ఎలక్షన్లను సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీని పై మొన్న ఆదివారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. పోలింగ్ కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలుకావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో చెప్పటాన్ని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. మొత్తానికి ఈ జడ్జిమెంట్ తో  ఏపీలో అధికార పార్టీ దూకుడికి కాస్త బ్రేక్ పడిందని చెప్పొచ్చు.

మళ్లీ.. మళ్లీ.. ఎదురుదెబ్బలు..

కోర్టుల్లో ఎదురుదెబ్బలు అనేవి జగన్ ప్రభుత్వానికి కామన్ అయిపోయాయి. అధికారులు కూడా వాటికి అలవాటు పడ్డట్లు కనిపిస్తోంది. షెడ్యూల్ విడుదల చేసే ముందు అన్ని జాగ్రత్తలూ తీసుకోకుండా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పటి నుంచీ ఇదే వరస. కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా గుడ్డిగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవని, ఈ పరిణామంతో అయినా ఇకపై ఒకటికి రెండు సార్లు రూల్స్, రెగ్యులేషన్స్ కి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

అంతా గందరగోళం..

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం మొదటి నుంచీ గందరగోళంగానే సాగుతోంది. ఈ ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతాయో ఏమిటో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏడాది కిందట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలను ఎక్కడ నిలిచిపోయాయో అక్కడి నుంచే మొదలు పెడతామని పేర్కొంటూ ఎస్ఈసీ నీలం సాహ్నీ ఈ నెల 1న తాజా షెడ్యూల్ ప్రకటించారు. దీనిపై జనసేన పార్టీ కొత్త అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పరిషత్ ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి జరపాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ వ్యాజ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.

Advertisement