Murali Mohan: మురళీ మోహన్ ‘జయభేరి’.. జరిమానా భారీ..

Murali Mohan స్తిరాస్థి వ్యాపారం అనగానే నాటి తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీ మోహన్ గుర్తుకు వస్తారు. ఆయన స్థాపించిన జయభేరి సంస్థకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరుంది. ఆయన్ని చూసి భూమిపై పెట్టుబడి పెట్టినవాళ్లు ఇండస్ట్రీలో, బయట ఎంతో మంది ఉన్నారు. తాను ఈ వ్యాపారంలోకి రావటానికి అందాల నటుడు శోభన్ బాబు ఇచ్చిన సలహాయే కారణమని మురళీ మోహన్ తరచూ చెబుతుంటారు. శోభన్ బాబు చెప్పిన ఒక మాటను పదే పదే గుర్తుచేసుకుంటూ ఉంటారు. ‘‘ప్రపంచంలో ఏదైనా పెరుగుతుందేమో గానీ భూమి విస్తీర్ణం మాత్రం పెరగదు. అందువల్ల భవిష్యత్తులో పోటెత్తే జనాభాకి తగ్గట్లు ల్యాండ్ దొరకదు. కాబట్టి భూమి విపరీతమైన డిమాండ్, రేటు పలుకుతుంది. అందుకే ఆ దిశగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు ఆర్జించొచ్చు’’ అని శోభన్ బాబు తనకు చెప్పినట్లు మురళీ మోహన్ అనేవారు.

నీతీ.. నిజాయితీ.. విలువలు..

జయభేరి సంస్థను ప్రారంభించేముందు చాలా మంది తనను భయపెట్టారని మురళీ మోహన్ చెప్పేవారు. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో నీతీ.. నిజాయితీ.. విలువలు.. విశ్వసనీయత వంటివి పాటించాలంటే కుదరదని, నీలాంటి మంచోళ్లు ఇందులో నిలదొక్కుకోలేరంటూ బంధుమిత్రులు మొదట్లో కాస్త ఆందోళనకు గురిచేశారని పేర్కొనేవారు. అయినప్పటికీ తాను ధైర్యంతో ముందడుగు వేశానని, పాతిక ముప్పై ఏళ్లుగా తనపై ఎక్కడా ఏ చిన్న రిమార్కు కూడా రాలేదని మురళీ మోహన్ గర్వంగా ఫీలయ్యేవారు.

సీన్ కట్ చేస్తే..

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ అనే ప్రాంతంలో జాతీయ రహదారికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఇదే మురళీ మోహన్ కి చెందిన జయభేరి సంస్థ నిర్మించిన ఒక మల్టీప్లెక్స్ కి ప్రభుత్వం భారీ జరిమానా(రూ.1.44 కోట్లు) విధించినట్లు ఇవాళ ప్రముఖ తెలుగు దినపత్రికలో వార్త వచ్చింది. ఐదేళ్ల కిందట ఏడున్నర ఎకరాల భూమిలో ఈ సంస్థ ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది. వేరే వాళ్ల పేరు మీద ఉన్న ఆ భూమిని తన పేరు మీదకు మార్చుకోకుండానే నిర్మాణం చేపట్టింది. ఇదేంటని అడిగితే చప్పుడు చేయలేదు. ఇలా అయితే కుదరదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న ఫైన్ వేయగా జయభేరి సంస్థ చలానా రూపంలో ఆ డబ్బును కట్టినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి నిన్న మంగళవారం రాత్రి చెప్పారు. ఇదీ సంగతి.

Advertisement