Anandayya: ‘‘ఆనంద’’మానందమాయే..

Anandayya: మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందుకు ఇవాళ సోమవారం ఓకే చెప్పేసింది. కేంద్ర సర్కారు నుంచి సానుకూల స్పందన రావటంతో ఈ ప్రకటన చేసింది. తద్వారా ప్రతిఒక్కరిలోనూ ఆనందం నింపింది. ఆనందయ్య ఔషధం కరోనాకి విరుగుడు కాదని స్పష్టం చేసింది. అదొక్కటే సర్వ రోగ నివారిణి కాదని, కొవిడ్ పాజిటివ్ అని తేలినవారు సంబంధిత మెడిసిన్స్ కూడా వాడాలని సూచించింది. ఆనందయ్య ఇచ్చే చుక్కల మందుకు మాత్రం పచ్చజెండా ఊపలేదు. దానికి ఇంకా చాలా సమయం పడుతుందని పేర్కొంది. పరిశీలన కొనసాగుతోందని, అది పూర్తయ్యాక అనుమతిస్తామని చెప్పింది. ఆనందయ్య నాలుగైదు రకాల మందులను పంపిణీ చేస్తుండగా అందులో ‘కె’ అనే ఔషధానికి కూడా సర్కారు సై అనలేదు. ‘పి’, ‘ఎల్’, ‘ఎఫ్’ రకాలను వాడుకోవచ్చని తేల్చిచెప్పింది.

Anandayya

రోగులు వెళ్లొద్దు సుమా..

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద వైద్యం కోసం కరోనా రోగులు డైరెక్టుగా అక్కడికి వెళ్లొద్దని, వెళితే మరింత మందికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఏపీ గవర్నమెంట్ హెచ్చరించింది. కొవిడ్ పేషెంట్ల బంధువులు వెళ్లి ఆనందయ్య మందు తెచ్చుకోవచ్చని, అయినప్పటికీ కరోనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని ఆదేశించింది. ఇదిలాఉండగా ఆనందయ్య ఔషధానికి ఏపీ హైకోర్టు సైతం ఈరోజు పర్మిషన్ ఇవ్వటం గమనార్హం. అదే సమయంలో.. కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోపు రిపోర్ట్ ఇవ్వాలంటూ డెడ్ లైన్ విధించింది.

Anandayya

ఆయన కూడా హ్యాపీ..

ఏపీ ప్రభుత్వం, హైకోర్టు రెండూ తన మందు పంపిణీకి అంగీకారం తెలపటంతో ఆనందయ్య ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆనందయ్య ఇంకా పోలీసుల అధీనంలోనే ఉన్నప్పటికీ ఆయన ఇంటికి మాత్రం జనం తండోప తండాలుగా వస్తున్నారు. ఇవాళ సాయంత్రం కల్లా ఆనందయ్య తన ఇంటికి చేరుకుంటారని భావిస్తున్నారు. పోలీసులు ఆయనకి ఇకనైనా విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని వందలు, వేల సంఖ్యలో కరోనా రోగుల కుటుంబీకులు ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్నారు. రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్యకి ఆయన వైద్యాన్ని కొనసాగించి ఉంటే బతికేవాడేమో అని అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఆనందయ్యకి గవర్నమెంట్ మద్దతుగా నిలవటం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్ని వర్గాల వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

Anandayya