Amaravati : అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పు.. వాళ్లకు ఇళ్ల కోసం స్పెషల్ జోన్
NQ Staff - October 29, 2022 / 10:54 AM IST

Amaravati : ఒక వైపు ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తూనే మరో వైపు అమరావతిలో కీలక మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
తాజాగా అమరావతి ప్రాంతంలో పేదల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ వారి ఇళ్ల నిర్మాణం కు ప్రభుత్వం సహకారం అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.
గవర్నర్ ఆమోద ముద్ర….
రాజధాని లోని ఐదు గ్రామాల పరిధిలో 900 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్లుగా తాజా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. జోనింగ్ లో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు సూచనలు 15 రోజుల్లో తెలియజేయాలని ప్రకటనలో పేర్కొన్నారు.
అమరావతిలో ఇతర ప్రాంతాల్లో పేదలకు స్థలాలకు ఉద్దేశించిన ఫైల్ పై ఇప్పటికే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో అమరావతిలో పేదల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలకు మార్గం సుగమం అయ్యింది.
అతి త్వరలోనే లబ్ధిదారులకు అమరావతిలో స్థలాలు కేటాయించబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల ను ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.