CM Jagan: 32 లక్షల మంది కల నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్

CM Jagan ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి దాదాపు ఏడేళ్లు కావొస్తోంది. అందులో ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే అధికారం చెలాయించాడు. ఆ రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది గిరిజనులు (షెడ్యూల్డ్ క్యాస్ట్-ఎస్టీ) ఉన్నారు. కానీ వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ రాలేదు. ఎస్సీ, ఎస్టీ కంబైన్డ్ కమిషననే కొనసాగించారు. అయితే.. ఈ లోటును కొంచెం ఆలస్యంగానైనా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చాడని ఆ సామాజిక వర్గం వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికొక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే ఏపీ మొట్టమొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కుంభా రవిబాబు ఇవాళ శనివారం అమరావతిలో బాధ్యతలు స్వీకరించారు.

ఆదివాసీల ఆత్మబంధువు..

ఈ సందర్భంగా కుంభా రవిబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ 32 లక్షల మంది గిరిజనుల కలను నెరవేర్చాడని సంతోషంగా చెప్పారు. ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో ముఖ్యమంత్రి ఆదివాసీల ఆత్మబంధువుగా మారారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎస్టీల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తానని కుంభా రవిబాబు హామీ ఇచ్చారు. గతంలో బుట్టదాఖలైన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని తప్పకుండా అమలుచేస్తానని తెలిపారు. గిరిజన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి క్షేత్ర స్థాయి పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తానని చెప్పారు.

cm jagan ap
cm jagan ap

ఎవరీయన?..

కుంభా రవిబాబు అరకు ప్రాంతానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు. అరకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. ఈయనను ఈ పదవిలో నియమిస్తూ ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులు విడుదల చేశారు. కుంభా రవిబాబు పదవీ కాలం మూడేళ్లు. ఎస్సీ, ఎస్టీ కంబైన్డ్ కమిషన్ ను జగన్ సర్కారు రెండుగా విడదీస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. అది గత డిసెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని గిరిజనుల సమస్యల పరిష్కారానికి మరింత వెసులుబాటు కల్పించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement