AP Cabinet : బీసీల రిజర్వేషన్లు ఇంకో పదేళ్లు. ఏపీ కేబినెట్ మరిన్ని కీలక నిర్ణయాలు..

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ రోజు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతిలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకి వెల్లడించారు. బీసీల రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించారు. అర్చకులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10 వేల గౌరవ వేతనాన్ని రూ.15 వేలకు పెంచారు. రెండో కేటగిరీ గుళ్లల్లోని అర్చకులకు ఇప్పుడు చెల్లిస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు. ఇమామ్ లకు సైతం ఇలాగే రూ.10 వేలు ఇవ్వనున్నారు. మౌజమ్ ల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు.

రైతులకు ఈ నెలలోనే దాదాపు 7 వేల కోట్లు..

రైతు భరోసా పథకం తొలి విడత కింద ఈ నెల 13వ తేదీన 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,040 కోట్లు, 25వ తేదీన 38 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.2,805 కోట్లు జమచేయనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఒక్కో కుటుంబానికి రూ.10 వేల పరిహారాన్ని ఈ నెల 18వ తేదీన మరో లక్షా 460 మందికి అందజేస్తారు. రైతులకు ఇప్పటికే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారు. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన సబ్సిడీని కూడా ఖాతాల్లో వేశారు.

ఏడో తరగతి నుంచే సీబీఎస్ఈ..

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై 7వ తరగతి నుంచే సీబీఎస్ఈ సిలబస్ ని ప్రవేశ పెడతారు. దీంతో 2024-25 విద్యాసంవత్సరం నుంచే సర్కారీ స్కూల్స్ లో టెన్త్ స్టూడెంట్స్ ఈ సిలబస్ తో పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోని 44,639 గవర్నమెంట్ బడుల్లో ఈ విధానం అమలుకానుంది. 2018-19లో ప్రభుత్వ పాఠశాలల్లో 52 లక్షల 23 వేల మంది విద్యార్థులు మాత్రమే ఉంటే 2020-21 నాటికి (ప్రస్తుతం) ఆ సంఖ్య 59 లక్షల 30 వేలకు (అంటే 7 లక్షల 7 వేలు) పెరిగింది. నాడు-నేడు కార్యక్రమం కింద సర్కారీ స్కూళ్ల డెవలప్మెంట్ కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

 

Advertisement