AP Cabinet : తాజా వార్త : ఏపీ క్యాబినెట్ ఎవరెవరికి శుభవార్తలు చెప్పిందంటే..

AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ రోజు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై లోతుగా చర్చించారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటికి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నిర్వహించిన మీటింగ్ కావటంతో దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజలు తమపై నమ్మకంతో మరోసారి అద్భుతమైన విజయాన్ని అందించిందుకు ప్రభుత్వం కూడా అంతే ఉత్సాహంతో సంచలన ప్రకటనలు చేస్తుందని జనం భావించారు. దీనికి తగ్గట్లే కొన్నింటిపై పబ్లిక్ ఊహించనివిధంగా గవర్నమెంట్ పాజిటివ్ గా స్పందించింది.

అమరావతికి రూ.3,000 కోట్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజధాని అమరావతి పరిధిలో గత ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని నిర్మాణాలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండిపోయాయి. దీంతో వాటిని పూర్తి చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. వీటి కోసం కావాల్సిన రూ.3000 కోట్ల నిధుల్ని అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏఎంఆర్డీఏ)కి బ్యాంక్ గ్యారెంటీ ద్వారా ఇప్పించాలని నిర్ణయించారు. అమరావతిలో ఇప్పటికే నిర్మాణం పూర్తైన, వివిధ దశల్లో పనుల్ని ఆపేసిన భవనాల్ని ఏం చేయాలనేదానిపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి ఇటీవలే క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

‘కాకినాడ’కు కానుక: AP Cabinet

కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్ఈజెడ్)కి భూములు ఇచ్చిన రైతులకు నష్ట పరిహారాన్ని సంబంధిత కమిటీ సూచించిన దానికన్నా ఎక్కువే ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఈజెడ్ పరిధిలోకి వచ్చే ఆరు ఊళ్లను వేరే చోటకు తరలించొద్దని కూడా తీర్మానించింది. ఈ రెండు నిర్ణయాలు ‘కాకినాడ’ బాధితులకు అమితానందం కలిగించేవే అని అంటున్నారు. వైఎస్సార్ ఉక్కు కర్మాగారం కన్ స్ట్రక్షన్ కోసం పార్ట్నర్ కంపెనీని సెలెక్ట్ చేయటానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP Cabinet : cp cabinet meeting given green signals to various schemes
AP Cabinet : cp cabinet meeting given green signals to various schemes

ఈబీసీలకు గుడ్ న్యూస్..

ఆర్థికంగా వెనకబడిన కులాల (ఈబీసీ) మహిళల కోసం రూపొందించిన ‘‘ఈబీసీ నేస్తం’’ పథకానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనికింద.. వచ్చే మూడు సంవత్సరాల్లో ఒక్కో లబ్ధిదారుకి రూ.45 వేల ఆర్థిక సాయం అందుతుంది. దీంతోపాటు కడప జిల్లాలో రెండు ఇండస్ట్రియల్ పార్కులకి భూమి కేటాయింపు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం తదితర అంశాలపైన కూడా ఏపీ క్యాబినెట్ చర్చించింది.

Advertisement