Jagan: జగన్ మరిన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండరంట. అవునా?.. ఎందుకు?..
Kondala Rao - April 27, 2021 / 02:27 PM IST

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా మూడేళ్లు ఉంటారని తాను అనుకోవట్లేదని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ పెట్టడాన్ని ఆయన తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా కంట్రోల్ పై ఫోకస్ పెట్టట్లేదని తప్పుపట్టారు. బిల్డింగులను కూల్చివేయటం, షాపులను తొలగించటం వంటి వాటిపై ఉన్న శ్రద్ధ కొవిడ్-19 నియంత్రణపై లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. కరోనా ఇంతలా వ్యాపిస్తుంటే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ పెట్టడం ఏంటని నిలదీశారు. జగన్ సర్కారు వైజాగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కొవిడ్-19 బాధితులకు మందుల కొరత రాకుండా చూడాలని సూచించారు. మెడిసిన్స్ పై మూడు నెలల పాటు జీఎస్టీ రద్దు చేయాలని విష్ణు కుమార్ రాజు కోరారు.
‘రాజు’వయ్యా.. మహ‘రాజు’వయ్యా..
విష్ణుకుమార్ రాజు ఇన్ని విషయాలు చెప్పారు గానీ అసలు సంగతులు చెప్పటం మర్చిపోయారు. జగన్ సీఎం కుర్చీలో మరిన్నాళ్లు ఎందుకు ఉండరో ఆయన వెల్లడించలేదు. రాత్రి పూట కర్ఫ్యూ పెట్టడం తుగ్లక్ చర్య ఎలా అవుతుందో వివరించలేదు. 18 ఏళ్లు దాటినవారందరికీ ఉచితంగా టీకా ఇవ్వలేం అంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న విష్ణుకుమార్ రాజు గారి పార్టీ చేతులెత్తేస్తే ఆ పనిని తాను చేస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు రావటం కూడా తప్పేనా సార్?. రాష్ట్రంలోని పేదలకు ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా ఇస్తానని ఏపీ సర్కారు ప్రకటించటం కూడా పొరపాటే కదా మాస్టారూ. భవనాలను గానీ షాపులను గానీ ఎందుకు కూల్చేస్తున్నారో తమకు తెలియదా నాయకా?. అవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు. అదీ పాపమేనా? అని జనం అడుగుతున్నారు.
మీ కార్యకర్తలు చేస్తున్నారా?..
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్-19 నియంత్రణపై అధికార యంత్రాంగానికి శ్రద్ధలేదని విష్ణుకుమార్ రాజు సెలవిస్తున్నారు. మరి, ఇఫ్పుడు అక్కడ అన్ని పనులనూ చక్కబెడుతున్నది ఎవరు? మీ బీజేపీ కార్యకర్తలా? నాయకులా?. గవర్నమెంట్ సిబ్బంది కాదా?. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అన్నట్లు ఉండకూడదు లీడర్ సాబ్. ఇలాంటి కష్టకాలంలో మంచి సలహాలిచ్చి, ఫ్రంట్ లైన్ వారియర్స్ ని కాస్త ఎంకరేజ్ చేయండి అని ప్రజలు హితవు పలుకుతున్నారు.