అయ్యన్నకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్.. అచ్చెన్న తరువాత ఇదే పెద్ద కేసు ?
Surya - November 4, 2020 / 07:08 PM IST

తెలుగుదేశం పార్టీలోని ఒక్కో పెద్ద తలకు ఒక్కో విధానం ఉంది వైఎస్ జగన్ దగ్గర. గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏయే అవినీతికి పాల్పడ్డారు, ఎవరి మీద ఎన్ని పాత కేసులున్నాయి అనేది బయటికి లాగి మరీ ఇరికించేస్తున్నారు. అలా ఇరుక్కున్న నాయకుడే అచ్చెన్నాయుడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ మీద, వైసీపీ మీద తన ప్రతాపం చూపించిన అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలోకి మారినా దూకుడు తగ్గించుకోలేదు. ఇంకాస్త వాయిస్ పెంచి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అలా ఆయన ఎగిరిపడుతుండగానే ఈఎస్ఐ కుంభకోణాన్ని బయటికిలాగి మీద పెద్ద బండ వేశారు జగన్. ఆ దెబ్బతో అచ్చెన్న కాస్త తగ్గారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి వచ్చినా ఆయనలో మునుపటి హుషారు కనిపించట్లేదు.
ఇక మరొక సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వంతు వచ్చేలా ఉంది. ఆయన కూడ జగన్ మీద వీరావేశంగా ఉన్నారు. అవకాశం కల్పించుకుని మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలు అంటే మామూలుగా కాదు వాటికి తనదైన పరుష పదజాలాన్ని జోడించి మరీ చేస్తున్నారు. గతంలో ఒక మహిళా ప్రభుత్వ అధికారి మీద నోటి దురుసు ప్రదర్శించిన ఆయనకు నిర్భయ కేసు పెట్టి షాకిచ్చారు పోలీసులు. అప్పటికీ తగ్గని ఆయన తాజాగా మరొకసారి నోటికి పనిచెప్పారు.
ఆయన తాజాగా గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మణాలను విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చడం పట్ల స్పందిస్తూ చదువు నేర్పే విద్యాసంస్థను కూల్చేస్తారా ? పడగొట్టిన వాడెవడు. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టించాడు. ముందు ఆ ఆర్‌డీవోను అంటూ బూతులు వదిలారు. ఇవన్నీ లెక్కగడుతూనే ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. అలాగే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద కూడ తనదైన శైలిలో తిట్ల దండకం చదువుతున్నారు. ఇది జగన్ బృందానికి అస్సలు నచ్చట్లేదు. అన్నిటినీ ఒకేసారి ప్రయోగించి అయ్యన్న మీద పెద్ద పిడుగే వేసేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారట.