Balakrishna : బాబు ఇవ్వని హామీలను సైతం బాలయ్య ఇస్తున్నారహో!

NQ Staff - December 27, 2023 / 08:20 PM IST

Balakrishna : బాబు ఇవ్వని హామీలను సైతం బాలయ్య ఇస్తున్నారహో!

Balakrishna :

‘‘మేం అధికారంలోకి వస్తే అవినీతిని అరికడుతాం..ప్రతీ పేదవారిని ఆదుకుంటాం..’’ ఇలాంటి రొటిన్ హామీలను ఏ నేత అయిన ఇవ్వొచ్చు. కానీ ఆర్థికపరమైన, విధానపరమైన నిర్ణయాలను కొందరు మాత్రమే అంటే.. పార్టీ అధినేతగానీ, పార్టీ సిద్ధాంతకర్త గానీ, పార్టీ వ్యవస్థాపకుడు గానీ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఆ హామీలను అమలు చేసే బాధ్యత వారి నెత్తిమీదే ఉంటుంది గనుక. ఎవరు పడితే వారు కీలక హామీలు ఇస్తే .. తీరా ఒకవేళ అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయాలని ప్రజలు రోడ్ల మీదకొస్తే.. ఆ తలపోటు అంతా ఎవరికీ? ఆ పార్టీ అధినేతకే.

ప్రస్తుతం టీడీపీ-జనసేన కూటమి నేతలు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ఎవరు పడితే వారు తమకు తోచిన హామీలు ఇచ్చేస్తున్నారు.. అది సాధ్యం అవుతుందా కదా అనేది ఆలోచించడం లేదు. ఓ వైపు పవన్ కల్యాణ్ తనకు తోచినట్లు హామీలు ఇచ్చేస్తారు. ఇక లోకేశ్ తానే సీఎం అయిపోతున్నట్టు ఊహించుకుని.. హామీలు గుప్పిస్తున్నారు. వీరందరిలో కెల్లా చంద్రబాబే కాస్త ఈ హామీల విషయంలో కుదురుగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా బాబు బావమరిది బాలయ్య కూడా విధాన, ఆర్థిక పరమైన హామీ కూడా ఇచ్చేశారు. లోతుగా అధ్యయనం చేసి ఇవ్వాల్సిన హామీని అలవోకగా అ..ఊ.. అంటూ ఇచ్చేశారు.

రాష్ట్రంలోని అంగన్ వాడీలు అనేకానేక గొంతెమ్మ కోరికలతో కొన్ని రోజులుగా సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం వారితో చర్చలు జరిపినా.. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వారి పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారి ఉద్యమంలో భాగంగా బుధవారం వైసీపీ, టీడీపీ.. సహ అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల ఇండ్లను ముట్టడించి ధర్నా చేశారు.

ఈక్రమంలో హిందూపురంలో అక్కడి ఎమ్మెల్యే బాలయ్య ఇంటిని కూడా ముట్టడించారు. ఈసందర్భంగా ఉద్యమకారులతో బాలయ్య ఫోన్ లో మాట్లాడారు. వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందని, ఉద్యమాన్ని కొనసాగించాలని సైతం పిలుపునిచ్చారు. మరో మూడు నెలల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాగానే అంగన్ వాడీల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాలయ్య హామీ ఇచ్చేశారు.

వాస్తవానికి అంగన్ వాడీల జీతాల పెంపు వంటి కోరికలను తీర్చడం అనేది అంత సులువైందేమీ కాదు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే అంతటి క్లిష్టమైనది. చంద్రబాబు కూడా ఈ హామీపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాము అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు కానీ జీతాల పెంపుపై ఒక్క మాట కూడా అనలేదు.

ఇదంతా తెలియని, ప్రాక్టికల్ గా ఏ అనుభవం లేని బాలయ్య మాత్రం జీతాల పెంపు సహ వారి కోరికల చిట్టా మొత్తం పరిష్కరిస్తామని హామీ ఇచ్చేస్తున్నారు. రేపు అధికారంలోకి గనుక వస్తే గిస్తే బాలయ్య మాటల వల్ల టీడీపీ ఇరుకునపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు మరో మూడు నెలలే ఉండడంతో తమ కూటమి నేతలు ఇస్తున్న హామీల చిట్టాను కాస్త స్క్రీనింగ్ చేస్తే మంచిదని టీడీపీ అధినేతకు సూచిస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us