Andhra Pradesh : ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ : విశాఖ కంటే శ్రీకాకుళం బెస్ట్.!
NQ Staff - October 26, 2022 / 03:03 PM IST

Andhra Pradesh : ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. మూడు రాజధానుల వ్యవహారంపై ఎటూ తేలడంలేదు గానీ, కొత్తగా పలు డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి రాజధానుల విషయమై.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికైతే ఒకే ఒక్క రాజధాని వుంది. అదే అమరావతి. కానీ, దాన్ని అధికార వైసీపీ గుర్తించడంలేదు. మంత్రులెవరూ అమరావతిని రాజధానిగా అంగీకరించడంలేదు.. ముఖ్యమంత్రిదీ అదే పరిస్థితి. మూడు రాజధానులైతేనే అమరావతిని శాసన రాజధానిగా గుర్తిస్తాం.. లేదంటే, అమరావతి స్మశానం మాత్రమే అన్నట్లుంది అధికార పార్టీ ఆలోచన.
విశాఖ గర్జన తర్వాత మారిన సమీకరణం..
విశాఖలో ఇటీవల మూడు రాజధానుల కోసం గర్జన జరిగింది. నాన్ పొలిటికల్ జేఏసీ ముసుగులో వైసీపీ చేసిన గర్జన ఇది. అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళారు. తమ నినాదం ఏకైక రాజధాని.. అని తేల్చి చెప్పారు.
విశాఖ మాత్రమే ఎందుకు.? శ్రీకాకుళం రాజధాని అయితే.. అప్పుడు కదా, మీరంటున్న అభివృద్ధి జరిగేది.? అంటూ జనసేన అధినేత, అదికార పార్టీకి షాకిచ్చారు. దాంతో, ఏం.. శ్రీకాకుళం ఎందుకు రాజధాని కాకూడదు.? అన్న చర్చ తెరపైకొచ్చింది.
ఎలాగూ విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరమే. శ్రీకాకుళం గనుక రాజధాని అయితే, దాంతోపాటుగా విజయనగరం కూడా అభివృద్ధి చెందుతుందన్నది కొత్త వాదన. కర్నూలు విషయంలోనూ ఇలాంటి అభిప్రాయమే వినిపిస్తోంది. కర్నూలు కంటే తిరుపతి బెస్ట్ ఆప్షన్ అన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.