Anandayya : ఆనందయ్యా.. మాతోనే నువ్వుండాలయ్యా..

Anandayya: ఆనందయ్యకు సంబంధించిన అప్డేట్స్ నిత్యం వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా పోలీసుల అధీనంలో ఉంటున్న ఆయన ఇవాళ శుక్రవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని తన సొంతింటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనందయ్యని పలువురు బీజేపీ నాయకులు కలిసి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ని చూసేందుకు జనం కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసులు ఆనందయ్యని వేరే ప్రాంతానికి తీసుకెళ్లే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని తమతోనే ఉంచాలని వాళ్లు కోరుతున్నారు. పోలీసులు ఆనందయ్యని కనీసం తన బంధువులతో కూడా మాట్లాడనీయట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణపట్నంలో కర్ఫ్యూ, 144 సెక్షన్లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

anandayya

ఎంపీ మాగుంట దగ్గర..

ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి దగ్గర ఆనందయ్య ఔషధం పొట్లాలు కనిపించటం సరికొత్త చర్చకు దారితీసింది. ఆ మందును సీక్రెట్ గా తయారుచేస్తున్నారనే ఆరోపణలకు ఇది బలం చేకూర్చుతోంది. ఈ రోజు జిల్లా సమీక్షా సమావేశంలో ఎంపీ మాగుంట తన వద్ద ఉన్న ఈ ప్యాకెట్లను మంత్రులు విశ్వరూప్, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. ఇదిలాఉండగా ఇవాళ శుక్రవారం తాను ఈ మందును పంపిణీ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆనందయ్య స్పష్టం చేశారు. కాబట్టి ఎవరూ కూడా కృష్ణపట్నం రావొద్దని ఆయన మనవి చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఔషధ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను సేకరించి, అందరికీ చెప్పిన తర్వాతే పంపిణీని ప్రారంభిస్తానని ఆనందయ్య వివరించారు.

anandayya

అధికారుల జోక్యం వద్దు..

ఔషధ పంపిణీలో ప్రభుత్వ అధికారులు కల్పించుకోకుండా నిలువరించాలని ఆనందయ్య నిన్న గురువారం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రజల బాగు కోరి తాను ఈ మందును ఫ్రీగా ఇస్తున్నానని, ఈ నేపథ్యంలో తనకు ప్రభుత్వ రక్షణ కల్పించాలని కోరారు. ఈ మెడిసిన్ ని తాను ఎలా తయారు చేస్తున్నానో, ఈ మేరకు ఏమేం పదార్థాలు వాడుతున్నానో ఆ ఫార్ములా చెప్పాలంటూ ఆఫీసర్లు తనను వేధిస్తున్నారని పేర్కొంటూ ఆయన అశ్వినీ కుమార్ అనే అడ్వొకేట్ ద్వారా న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆనందయ్య మందుపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అతికొద్ది రోజుల్లోనే పరిశోధన పూర్తి చేసి నివేదిక ఇస్తామని కేంద్ర ఆయుష్ ఇన్ ఛార్జ్ మినిస్టర్ కిరణ్ రిజిజు వైఎస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడికి తెలిపారు.