TDP: ఇప్పుడు ఎలక్షన్ వద్దు అన్నాడు.. రేపు పార్టీని రద్దు చేస్తాడు..

TDP ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని ఒక వైపు సొంత పార్టీ నాయకులే తప్పు పడుతుండగా మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శకం ఇక ముగిసిందని అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. మరోసారి ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ శనివారం అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ రాజ్యాంగబద్ధంగా తన బాధ్యతలను నెరవేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొనొద్దని బాయ్ కాట్ చేసిన చంద్రబాబు రేపు తెలుగుదేశం పార్టీని కూడా రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్లు ఇకనైనా బరి నుంచి తప్పుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.

బీజేపీయే ప్రత్యామ్నాయం..   

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయ, స్థానిక సంస్థల ఎన్నికల యుద్ధరంగం నుంచి జారుకుంది కాబట్టి ఇక ఏపీలో బీజేపీయే ప్రత్యామ్నాయమని తెలంగాణలోని దుబ్బాక శాసన సభ్యుడు రఘునందనరావు వెల్లడించారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే చట్ట సభల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కావని, డెవల్మెంట్ జరగదని విమర్శించారు. జగన్ సర్కారు పరిపాలనను పక్కన పెట్టి మత ప్రచారం చేసుకుంటోందని తప్పుపట్టారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తే అన్యమత ప్రచారం, అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా చూస్తామని, ఈ మేరకు ఒక చట్టం చేస్తామని రఘునందనరావు హామీ ఇచ్చారు.

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు ప్రచారం ఊపందుకుంది. ఒక వైపు టీడీపీ, మరోవైపు బీజేపే-జనసేన క్యాన్వాస్ చేస్తున్నాయి. ఈరోజు ప్రచారంలో తెలంగాణ కమలం పార్టీ ఎమ్మెల్యే రఘునందనరావు, జనసేన పార్టీ నాయకుడు హరిప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు తెలుగుదేశం తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు ప్రచారం నిర్వహించారు.

Advertisement