Amaravati : అమరావతి రగడ : ఎదురు దెబ్బ ఎవరికి తగిలిందబ్బా.?
NQ Staff - November 1, 2022 / 09:30 PM IST

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ, అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతి వరకు చేపట్టిన పాదయాత్రకు పెద్దగా ఇబ్బందులేవీ లేవు. అయితే, ఈసారి అమరావతి నుంచి అరసవిల్లి దేవస్థానానికి ప్రారంభించిన యాత్రలో మాత్రం అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
కాగా, ఈ యాత్ర విషయమై తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డులు వున్నవారే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. అదే సమయంలో రైతులకు వెంటనే ఐడీ కార్డులు అందించాలని పోలీసు అధికారుల్నీ న్యాయస్థానం ఆదేశించింది. ఈ యాత్రకు సంఘీభావం తెలిపేవారు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలపవచ్చునని కూడా న్యాయస్థానం పేర్కొంది.
ఇంతకీ ఎవరికి ఎదురుదెబ్బ..?
టీడీపీ అనుకూల మీడియాలో ఒకలా, వైసీపీ అనుకూల మీడియా ఇంకొకలా హైకోర్టు తీర్పు గురించి వక్రీకరణలు కనిపిస్తున్నాయి. వాస్తవం ఏంటన్నది మాత్రం సాధారణ ప్రజలకు అర్థం కావడంలేదు. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అంటోంది టీడీపీ అనుకూల మీడియా. అమరావతి రైతులకు ఎదురు దెబ్బ అంటోంది అధికార పార్టీ అనుకూల మీడియా.
దేశంలో పాదయాత్రలు కొత్త కాదు. ఏ పాదయాత్రలోనూ ‘ఐడీ కార్డులతో’ అనే నిబంధన లేదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’నే ఇందుకు నిదర్శనం.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడూ ఇలాంటి ఆంక్షలు లేవు.! వక్రీకరణలంటే అవి ఎప్పుడూ మామూలే రాజకీయాల్లో. న్యాయస్థానాల తీర్పులపై వక్రీకరణలే ఒకింత ఆశ్చర్యకరం. హైకోర్టు తీర్పు అమరావతి రైతులకు ఎదురు దెబ్బ అయితే, ఇక్కడితో యాత్ర ఆగిపోవాలి. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అయితే, రైతుల పాదయాత్రకు ఆటంకాలు వుండకూడదు. ఏమో, ఏం జరుగుతుందో చూడాలిక.