Amaravati : అమరావతి రైతుల పాదయాత్ర: పోలీసుల రెడ్ సిగ్నల్.! హైకోర్టు గ్రీన్ సిగ్నల్.!
NQ Staff - September 9, 2022 / 02:57 PM IST

Amaravati : అమరావతి రైతులు మరోమారు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ అమరావతి నుంచి తిరుపతికి మహా పాదయాత్ర నిర్వహించారు అమరావతి కోసం భూములిచ్చిన రైతులు. ఇప్పుడేమో, అదే అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి మహా పాదయాత్ర చేపట్టనున్నారు.
అయితే, షరామామూలుగానే అమరావతి రైతుల మహా పాదయాత్రకు పోలీసు శాఖ ‘రెడ్ సిగ్నల్’ వేసింది. పాదయాత్రకు అనుమతిచ్చేది లేదని సాక్షాత్తూ డీజీపీ స్పష్టం చేశారు. గతంలోనూ అమరావతి రైతుల పాదయాత్రకు పోలీసు శాఖ ఇలాగే అడ్డంకులు సృష్టించింది. అప్పుడు కూడా రైతులు హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.
షరతులకు లోబడి పాదయాత్రకు అనుమతి..

Amaravati Farmers Maha Padayatra Has Given High COURT Green Signal
పోలీసు శాఖకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు తాజాగా న్యాయస్థానం సూచించింది. పోలీసు శాఖ వెంటనే అనుమతులు జారీ చేయాలని కూడా హైకోర్టు ఆదేశించడం గమనార్హం. దాంతో, అమరావతి రైతుల మహా పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది.
శాంతి భద్రతల సమస్యను పోలీసు శాఖ సాకుగా చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు శాఖ పదే పదే ఈ ప్రస్తావన ఎందుకు తెస్తోందన్నది అనుమానాస్పదంగా మారుతోంది. గతంలో హైకోర్టు ఆక్షేపించినా, ఇప్పుడూ అదే రీతిలో పాదయాత్రకు ఎందుకు పోలీసు శాఖ ‘నో’ చెప్పిందన్నది అర్థం కాని విషయం.
ఎలాగైతేనేం, తమ పాదయాత్రకు హైకోర్టు నుంచి అనుమతి రావడం పట్ల అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.