Y. S. Vijayamma: వైఎస్ విజయమ్మకి కౌంటర్..

Y. S. Vijayamma వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో నాటి మంత్రి, నేటి బీజేపీ లీడర్ ఆదినారాయణరెడ్డి పైనే మా కుటుంబానికి అనుమానం ఉందన్న వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటనను ఆదినారాయణరెడ్డి ఖండించారు. ‘‘ఇరు వర్గాలు ఢిల్లీ వెళ్లి సీబీఐ కార్యాలయంలో కూర్చొని విచారణ జరిపించుకుందాం. నేనే నేరస్తుణ్ని అని ఆ దర్యాప్తులో తేలితే నన్ను ఎక్కడైనా ఓపెన్ గానే ఉరి తీయండి’’ అని సవాల్ విసిరారు. ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నిన్న మంగళవారం కడప జిల్లాలోని జమ్మలమడుగు, పెద్దముడియం మండలాల్లోని పలు పల్లెల్లో ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ఎస్.ఉప్పలపాడు, పెద్దపసుపుల గ్రామాల్లో ఆయన తన ప్రసంగాల్లో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా వైఎస్ విజయమ్మకి పొలిటికల్ కౌంటర్ వేశారు.

రెండేళ్లు దాటింది..

‘‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15వ తేదీన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ కేసును ఇప్పుడు సీబీఐ విచారణ జరుపుతోంది. నాపై ఇంకా అనుమానం ఉంటే నేను చెప్పిన పనిచేద్దాం. నాదే తప్పు అని రుజువైతే అక్కడికక్కడే చర్యలు తీసుకోవచ్చు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం’’ అని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. తన తండ్రి చనిపోయి రెండేళ్లు పూర్తయినా తనకు న్యాయం జరగలేదంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అదునుగా జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ ని టార్గెట్ చేశారు.

ఎప్పుడూ లేనిది?..

ఈ కేసు విషయంలో వైఎస్ విజయమ్మ ఎప్పుడూ లేనిది మొన్న అకస్మాత్తుగా ఆగ్రహంగా స్పందించారు. ప్రతిపక్ష పార్టీలను, పచ్చ పత్రికను తప్పుపట్టారు. ఈ మేరకు ఐదు పేజీల లేఖను విడుదల చేశారు. అందులో ఆదినారాయణరెడ్డి ప్రస్తావన తెచ్చారు. అయితే ఆమె ఆరోపణలపై ఆదినారాయణరెడ్డి కన్నా ముందు తెలుగుదేశం పార్టీ హార్ష్ గా రియాక్ట్ కావటం గమనార్హం.

Advertisement