8 Years Boy: ఎనిమిదేళ్ల‌కే ఆటోని న‌డుపుతూ కుటుంబ భారాన్ని మోస్తున్న బాలుడు

8 years Boy: కొంద‌రి జీవితాల‌లో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు వింటుంటే ఎవ‌రికైన ఆశ్చ‌ర్య‌మేస్తుంది. సాధార‌ణంగా ఎవరి కుటుంబంలోనైన పిల్ల‌ల‌ను ముద్దుగా పెంచుకుంటూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారిని ఏ మాత్రం క‌ష్ట‌పెట్ట‌కూడ‌ద‌ని భావిస్తుంటారు. కాని ఓ బాలుడికి చిన్న వ‌య‌స్సులోనే పెద్ద క‌ష్ట‌మొచ్చింది. కుటుంబ బాధ్య‌త మొత్తం మోయాల్సిన ప‌రిస్థితి అత‌నిపై ప‌డింది.

8 years Boy in Andhra Pradesh Drives Auto
8 years Boy in Andhra Pradesh Drives Auto

వివ‌రాల‌లోకి వెళితే చంద్ర‌గిరి మండల పరిధిలోని గంగుడుపల్లి గ్రామానికి చెందిన బండి పాపిరెడ్డికి వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన రేవతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గోపాలకృష్ణారెడ్డి, హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి ముగ్గురు సంతానం. పాపిరెడ్డి చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయాడు. రేవతి పుట్టుకతోనే అంధురాలు. వీరికి ప్ర‌భుత్వం పించన్ ఇస్తుండ‌గా, దానిపైనే ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్నారు.

అయితే వీరి పెద్ద కొడుకు గోపాలకృష్ణారెడ్డి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు అంధులు కావ‌డంతో కుటుంబ పోష‌ణ క‌ష్టంగా మారింది. దీంతో తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు ఆటో నడపడం నేర్చుకున్నాడు. గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాలు విక్రయిస్తున్నాడు.

స్కూల్‌కి వెళుతూ అది ముగిసాక ఆటోలో త‌న తండ్రి పాపిరెడ్డిని ఎక్కించుకొని గ్రామాల్లో తిరుగుతూ వంట సామాగ్రి విక్ర‌యిస్తున్నాడు. అప్పులు చేసి బ్యాటరీ ఆటో తీసుకున్నాం అని పాపిరెడ్డి చెబుతుండ‌గా, ఇంటి వద్దే వాడికి ఆటో ఎలా నడపాలో చెప్పేవాడిని. నిదానంగా ఆటో నడపడం వాడే నేర్చుకున్నాడు. ఇప్పుడు స్కూల్‌ అయిపోగానే ఉప్పు, బియ్యం, పప్పు దినుసులు వగైరా ఆటోలో తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు.

ఇంట్లో పండిన ఆకుకూర‌లు, కూర‌గాయాలు సైతం తిరుప‌తికి తీసుకెళ్లి విక్రయించి ఇంటికి వ‌స్తుంటాడు.ఆడుకోవ‌ల‌సిన వ‌య‌స్సులో క‌ష్ట‌ప‌డుతూ మ‌మ్మ‌ల్ని పోషిస్తున్నాడు అంటూ పాపిరెడ్డి చెప్పుకొచ్చాడు.అయితే వారిని ఆదుకునేందుకు క‌లెక్ట‌ర్ అన్ని చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని అన్నారు. పిల్లల చదువుతో పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అంధ దంపతులకు పింఛను, అమ్మఒడి, రేషన్‌ సరుకులు, జగనన్న కాలనీలో ఇల్లును మంజూరు చేశారు.